. సెల్‌ఫోన్లు అపహరించి పరారవుతున్న దొంగలు..
. గుర్తించి వెంబడించిన సౌత్ జోన్ డీసీపీ చైతన్యకుమార్..
. డీసీపీపై కత్తితో దాడికి యత్నించిన దుండగులు..
. గన్తో మూడు రౌండ్ల కాల్పులు జరిపిన డీసీపీ..
Hyderabad: మొబైల్ దొంగిలించి పరారవుతున్న ఇద్దరు దొంగలు(mobile thieves) సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య కుమార్(South East DCP Chaitanya Kumar)పై కత్తితో దాడి చేసేందుకు యత్నించారు. ఈక్రమంలో డీసీపీ నిందితులపై మూడు రౌండ్ల కాల్పులు(firing) జరిపారు. తెలిసిన వివరాల ప్రకారం.. శనివారం హైదరాబాద్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ కూడా హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన తిరిగి తన కార్యాలయానికి వస్తున్నారు. ఈ క్రమంలో చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ వద్ద ఇద్దరు దొంగలు సెల్‌ఫోన్లను చోరీ చేసి పారిపోతుండటం గమనించారు. వెంటనే డీసీపీ చైతన్య తన గన్‌మెన్‌ను అప్రమత్తం చేశారు.
డీసీపీ, గన్‌మెన్ కలిసి ఆ ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు యత్నించారు. దొంగలు ఈ క్రమంలో డీసీపీపై కత్తితో దాడి చేసేందుక యత్నించారు. దీంతో డీసీపీ తప్పించుకునేందుకు ప్రయత్నించారు. దొంగలను గన్‌మెన్ అడ్డుకునేందుకు యత్నించాడు. కానీ, తోపులాటలో గన్‌మెన్ కింద పడిపోయాడు. డీసీపీ అప్రమత్తమై గన్‌మెన్ వద్ద ఉన్న గన్ తీసుకుని దొంగలపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఇద్దరిలో ఒక దొంగకు తీవ్ర గాయాలయ్యాయి. దొంగకు ఛాతి, వెన్ను భాగంలో గాయాలవడంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలిని సౌత్, సెంట్రల్ జోన్ డీసీపీలు స్నేహామెహ్రా, శిల్పావళి పరిశీలించారు. అలాగే తోపులాటలో గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీసీపీ చైతన్య కుమార్‌ను పరామర్శించారు.
