Money laundering case : ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)(ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌హెచ్ఎఫ్ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్ఎల్) సంస్థల ద్వారా ప్రజాధనాన్ని మళ్లించారన్న మనీలాండరింగ్ కేసులో ఆయనకు చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కి పైగా ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 31న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశామని సమాచారం. జప్తు చేసిన ఆస్తుల జాబితాలో ముంబైలోని పాలి హిల్‌లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, న్యూఢిల్లీలోని రిలయన్స్ సెంటర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నివాస, వాణిజ్య భవనాలు, భూములు ఉన్నాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై వంటి పలు నగరాల్లో ఈ ఆస్తులు విస్తరించి ఉన్నాయని అధికారులు తెలిపారు.
దర్యాప్తు వివరాల ప్రకారం, 2017 నుండి 2019 మధ్యకాలంలో యెస్ బ్యాంక్ ఆర్‌హెచ్ఎఫ్ఎల్‌లో ₹2,965 కోట్లు, ఆర్‌సీఎఫ్ఎల్‌లో ₹2,045 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. కానీ 2019 డిసెంబర్ నాటికి ఇవి నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారాయి. ఆర్‌హెచ్ఎఫ్ఎల్ నుండి ₹1,353 కోట్లు, ఆర్‌సీఎఫ్ఎల్ నుండి ₹1,984 కోట్ల బకాయిలు చెల్లించబడలేదని ఈడీ తేల్చింది. సెబీ నిబంధనల ప్రకారం రిలయన్స్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్‌కి అనిల్ అంబానీ గ్రూప్ ఆర్థిక సంస్థల్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం నిషేధం. అయితే, ఈ పరిమితులను తప్పించుకునేందుకు యెస్ బ్యాంక్ ద్వారా పరోక్షంగా ప్రజాధనాన్ని ఆర్‌హెచ్ఎఫ్ఎల్, ఆర్‌సీఎఫ్ఎల్ సంస్థలకు మళ్లించారని ఈడీ దర్యాప్తు నిర్ధారించింది. ఆ తరువాత ఈ సంస్థలు ఆ నిధులను అంబానీకి చెందిన ఇతర కంపెనీలకు రుణాల రూపంలో ఇచ్చినట్లు తేలింది.
అంతేకాకుండా, రుణాల మంజూరులో తీవ్రమైన అవకతవకలు జరిగాయని ఈడీ పేర్కొంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తు చేసుకునే ముందు నుంచే నిధులు విడుదలయ్యాయని, ఒకే రోజు దరఖాస్తు, మంజూరు, ఒప్పంద ప్రక్రియలు పూర్తి అయ్యాయని వెల్లడించింది. దీనిని ఈడీ “ఉద్దేశపూర్వక నియంత్రణ వైఫల్యం”గా అభివర్ణించింది. ఇక, దర్యాప్తు పరిధిని రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్‌కామ్) వరకూ విస్తరించిన ఈడీ, ₹13,600 కోట్లకు పైగా వ్యవస్థీకృత రుణ మోసాలు జరిగినట్లు గుర్తించింది. అందులో ₹12,600 కోట్లను అనుబంధ సంస్థలకు, మరో ₹1,800 కోట్లను మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో గ్రూప్ కంపెనీలకు తరలించినట్లు తేలింది. ఈ నేరంలో భాగమైన మరిన్ని ఆస్తులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని ఈడీ వెల్లడించింది. జప్తు చేసిన ఆస్తుల ద్వారా రికవరీ చేసిన మొత్తం ప్రజలకే చెందుతుందని, ఈ కేసులో న్యాయపరమైన చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.
