Delhi : దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని (Air pollution) తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ప్రయత్నాలకు సిద్ధమవుతోంది. కాలుష్య నియంత్రణలో భాగంగా కృత్రిమ వర్షం కురిపించే ‘క్లౌడ్ సీడింగ్’(Cloud Seeding) ప్రయోగానికి రంగం సిద్ధమైందని అధికార వర్గాలు వెల్లడించాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మంగళవారం తొలి విడత ట్రయల్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రయోగం ద్వారా గాలిలోని ధూళి, హానికర కణాలను కృత్రిమ వర్షం ద్వారా నేలకూల్చి కాలుష్య స్థాయిని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ, ప్రయోగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. “క్లౌడ్ సీడింగ్ సాధ్యాసాధ్యాలపై సమీక్షా సమావేశం నిర్వహించాం. ఈ ప్రాజెక్ట్‌లో ఉపయోగించే ప్రత్యేక విమానం కాన్పూర్ నుంచి రేపు ఢిల్లీకి చేరుకుంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే, మంగళవారం ట్రయల్ ఫ్లైట్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. అయితే ఇది పూర్తిగా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన వివరించారు.
ఈ ప్రాజెక్ట్‌ను ఐఐటీ కాన్పూర్ సాంకేతిక పర్యవేక్షణలో అమలు చేస్తున్నారు. ఇప్పటికే బురారీ ప్రాంతంలో ఒక టెస్ట్ ఫ్లైట్ నిర్వహించగా, ఆ సమయంలో విమానం నుంచి సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ వంటి రసాయనాలను తక్కువ మోతాదులో విడుదల చేశారు. అయితే ఆ సమయంలో వాతావరణంలో తేమ 20 శాతం కంటే తక్కువగా ఉండటంతో వర్షం కురవలేదు. ఆ టెస్ట్ ద్వారా విమానం, పరికరాల పనితీరు, విభిన్న శాఖల మధ్య సమన్వయం వంటి అంశాలను అంచనా వేసినట్లు ఐఐటీ కాన్పూర్ నివేదికలో పేర్కొంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం అక్టోబర్ 28 నుంచి 30 మధ్య ఢిల్లీలో వర్షానికి అనువైన మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా గత వారం “వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ 29న ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం కురిసే అవకాశం ఉంది” అని వెల్లడించారు.
క్లౌడ్ సీడింగ్ ప్రాజెక్ట్ అమలుకు ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఐదు విడతల ప్రయోగాల కోసం రూ. 3.21 కోట్లు కేటాయించగా, ఈ ప్రతిపాదనకు కేబినెట్ మే 7న ఆమోదం తెలిపింది. ప్రయోగాలకు డీజీసీఏ, పర్యావరణ, రక్షణ, హోం మంత్రిత్వ శాఖలతో పాటు పది శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పటికే లభించాయి. అయితే, వాతావరణం సహకరించకపోవడంతో గత మే, జూన్, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ ప్రయత్నం పలుమార్లు వాయిదా పడింది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉండటంతో, ఈ క్లౌడ్ సీడింగ్ ప్రయత్నం నగరానికి కొంత ఉపశమనం కలిగిస్తుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.
