PM Modi: దేశం వికసిత్ భారత్ (Viksit Bharat)వైపు పయనించాలంటే రైతులు కీలకంగా సహకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయం ఆధారస్తంభంగా ఉండగా, రైతుల(Farmers) కృషి వల్లే ఆర్ధిక వ్యవస్థ బలపడుతోందని ఆయన అన్నారు. కేవలం పిండి ధాన్యాలపై ఆధారపడకుండా, ప్రొటీన్ శాతం అధికంగా ఉండే పప్పు ధాన్యాల సాగు(Cultivation of pulses)పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రపంచ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని వాణిజ్య పంటలను పండించేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం రైతుల ఖర్చులను తగ్గించడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా అనేక చర్యలు చేపట్టిందని మోదీ తెలిపారు.
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (PM Dhan Dhan Kshetra Yojana) దేశ వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో దేశంలోని వెనకబడిన జిల్లాలను గుర్తించి వాటిని విస్మరించిన తీరు గమనించదగ్గదని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాలను అభివృద్ధికి నాంది పలికే “ఆసాకిరణ జిల్లాలు”గా ప్రకటించి, విస్తృత ప్రణాళికలతో అభివృద్ధి పనులను ప్రారంభించిందని వివరించారు. వ్యవసాయంపై ప్రత్యేక ప్రాజెక్టులు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రతి రైతును సాధికారతతో కూడిన సమృద్ధి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బేసిక్ సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం, రహదారులు, నివాసం, విద్యుత్ వంటి అవసరాలను తీర్చే దిశగా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
మోదీ తమ పాలనలో FPOలు (రైతు ఉత్పత్తిదారుల సంస్థలు) సంఖ్య భారీగా పెరిగిందని, ఇవి రైతులకు మార్కెటింగ్, నిల్వల సదుపాయాలు కల్పించడంలో ఎంతో మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. గత పదకొండేళ్లలో పదివేలకు పైగా FPOలు ఏర్పడినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో పదేళ్లలో కేవలం రూ.5 కోట్లు వ్యవసాయ సబ్సిడీగా మంజూరు చేస్తే, తమ ప్రభుత్వం మాత్రం రూ.13 లక్షల కోట్లకు పైగా రైతులకు సబ్సిడీలు అందించిందని గుర్తు చేశారు. ఇది రైతుల సంక్షేమం పట్ల తమ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు రైతుల భాగస్వామ్యం అత్యవసరమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వ్యవసాయం ఆధునికతతో పల్లెల అభివృద్ధికి మార్గం చూపుతున్నదని తెలిపారు.