Karnataka road accident: కర్ణాటక రాష్ట్రంలో ఈ తెల్లవారుజామున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో(Passengers) వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus)ను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి గోకర్ణకు బయలుదేరిన ఈ బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. హెబ్బులి హైవేపై హిరియూర్ సమీపంలోని గోర్లట్టు వద్ద తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రయాణికులలో చాలామంది నిద్రలో ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్లు చెబుతున్నారు.
లారీ ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. ఇంధనం ఉండటంతో అగ్ని మరింత ఉద్ధృతంగా మారి, బస్సు మొత్తం కాలిపోయింది. కొద్దిసేపటికే వాహనం పూర్తిగా దగ్ధమై ఇనుప కంకాళంగా మిగిలింది. మంటల ధాటికి కొంతమంది ప్రయాణికులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద స్థలంలో రహదారి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో వారి గుర్తింపు కష్టంగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. డీఎన్‌ఏ పరీక్షల సహాయంతో గుర్తింపు ప్రక్రియ చేపట్టే అవకాశముందని సమాచారం. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, వేగం, లేదా రోడ్డు పరిస్థితులే కారణమా అనే అంశాలపై విచారణ సాగుతోంది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందించే విషయంపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Horrible accident Near Hiriyur along Bengaluru Hubballi highway, sleeper bus caught fire, 30+ feared dead! .#Busfire #chitradurga #karnataka pic.twitter.com/Fdpe5Tg999
— Naik Kartik (@mekartiknaik) December 24, 2025
