Garib Rath Express: పంజాబ్(Punjab) రాష్ట్రంలోని సిర్హింద్ రైల్వే స్టేషన్ సమీపంలో అమృత్‌సర్ నుంచి బీహార్‌లోని సహర్సా వెళుతున్న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో( Garib Rath Express) శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో నిండి ఉన్న రైలులో మంటలు చెలరేగినా, సిబ్బంది చురుకైన చర్యలతో అందరూ సురక్షితంగా బయటపడటం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే… రైలు అంబాలాకు అర్ధ కిలోమీటరు దూరంలో ఉండగా, ఓ కోచ్ నుంచి దట్టమైన పొగలు రావడం గమనించిన ప్రయాణికులు, రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే లోకో పైలట్ రైలు ఆపడంతో పాటు, కోచ్‌ల నుంచి ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించేశారు. ఈ ఘటన సమయంలో కొంతమంది ప్రయాణికులు భయంతో పరుగులు తీయడం కనపడింది.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చాయి. సకాలంలో స్పందించిన సిబ్బందికి జీఎ్‌ర్పీ అధికారులు ప్రశంసలు కురిపించారు. సిర్హింద్ జీఆర్‌పీ ఎస్‌హెచ్‌ఓ రతన్ లాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం తృటిలో తప్పిన ప్రమాదంగా అభివర్ణించవచ్చు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రాలేదని, ఫైరింగ్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందేమో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని వారు చెప్పారు.
ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, నిలిచిన ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని గంటల తర్వాత మార్గాన్ని తిరిగి తెరిచారు. ప్రయాణికుల సురక్షిత రవాణకే తమ ప్రధాన లక్ష్యమని రైల్వే అధికారులు పునరుద్ఘాటించారు. ఈ సంఘటన రైల్వే సిబ్బందికి అప్రమత్తంగా ఉండే అవసరాన్ని మరింతగా నొక్కిచెబుతుంది.
