- ఐపీఎల్ ఫైనల్‌లో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై ఇండియన్స్
- రాణించిన బౌల్ట్, కెప్టెన్ రోహిత్
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా రెండోసారి ట్రోఫీ నెగ్గింది. మొత్తంగా ముబై జట్టుకిది ఐదో ఐపీఎల్ ట్రోఫీ. వేదిక ఏదైనా టైటిల్ వేటలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది ముంబై జట్టు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను మరొకసారి ముద్దాడింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించి విజయంలో కీలక పాత్ర పోషించగా, ఇషాన్ కిషన్( 33 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్వింటన్ డీకాక్-రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. వీరిద్దరూ ఆది నుంచి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడి స్కోరును పరుగులు పెట్టించారు. స్టోయినిస్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి డీకాక్(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాడు. దాంతో 45 పరుగుల వద్ద ముంబై తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో రోహిత్‌కు సూర్యకుమార్ యాదవ్ జత కలిశాడు. ఈ జోడి రెండో వికెట్‌కు 45 పరుగులు జత చేసిన తర్వాత సూర్యకుమార్(19; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రనౌట్ అయ్యాడు. అనంతరం రోహిత్- ఇషాన్ కిషన్‌లు జోడి 47 పరుగులు జత చేసింది. ముంబై స్కోరు 137 పరుగుల వద్ద ఉండగా రోహిత్ మూడో వికెట్‌గా ఔట్ కాగా, పొలార్డ్(9; 4 బంతుల్లో 2 ఫోర్లు) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా(3) నిరాశపరిచాడు. అయినప్పటికీ అది జట్టుపై పెద్దగా ప్రభావం చూపలేదు. అప్పటికే ముంబై లక్ష్యానికి చేరువైంది. కృనాల్‌తో కలిసి కిషన్ జట్టును గెలిపించాడు. దీంతో ముంబై రికార్డు స్థాయిలో ఐపీఎల్ టైటిల్స్ నెగ్గిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్ పంత్(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(65 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించడంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్-స్టోయినిస్ ఆరంభించారు. తొలి ఓవర్‌ను అందుకున్న బౌల్ట్ తాను వేసిన తొలి బంతికే స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. బుల్లెట్‌లా దూసుకొచ్చిన ఆ బంతికి స్టోయినిస్ వద్ద సమాధానం లేకుండా పోయింది. స్టోయినిస్ ఎలా ఆడాలని నిర్ణయించుకునేలోపే ఆ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ డీకాక్ చేతుల్లోకి వెళ్లింది. దాంతో స్టోయినిస్ గోల్డెన్ డక్‌గా నిష్క్రమించాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్ నాల్గో బంతికి అజింక్యా రహానే(2) పెవిలియన్ చేరాడు. దాంతో 16 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శిఖర్ ధావన్(15) ఔటయ్యాడు. ధావన్‌ను జయంత్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫుల్ ఫామ్‌లో ఉన్న ధావన్ ఔటవడంతో ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. దాంతో ఢిల్లీ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ తరుణంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్-రిషభ్ పంత్ కలిసి ఇన్నింగ్స్‌ను గొప్పగా నిర్మించారు. ఈ జోడీ వికెట్లను ఆదిలోనే కోల్పోయమనే విషయాన్ని పక్కకు పెట్టి ఫ్రీగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ 96 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఢిల్లీ తేరుకుంది. పంత్ హాఫ్ సెంచరీ సాధించిన కాసేపటికి ఔటయ్యాడు. కౌల్టర్ నైల్ వేసిన 15 ఓవర్ చివరి బంతికి హార్దిక్ క్యాచ్ పట్టడంతో పంత్ ఔటయ్యాడు. అటు తర్వాత హెట్‌మెయిర్(5) కూడా నిరాశపరిచాడు. బౌల్ట్ బౌలింగ్‌లో హెట్‌మెయిర్ ఔటయ్యాడు. అయ్యర్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు.ముంబై బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లు సాధించగా.. కౌల్టర్ నైల్ రెండు వికెట్లు తీశాడు. జయంత్ యాదవ్‌కు వికెట్ దక్కింది. బౌల్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.