Chiranjeevi Charitable Trust : ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నిరంతరం సేవలందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi)స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (CCT) కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనేక ఏళ్లుగా రక్తదానం, నేత్రదానం కార్యక్రమాల్లో ముందుండి పనిచేస్తున్న ఈ ట్రస్ట్‌కు ఇప్పుడు విదేశాల నుంచి కూడా విరాళాలు స్వీకరించే అవకాశం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అధికారులు అధికారికంగా అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దేశీయ విరాళాల వరకే పరిమితమైన ట్రస్ట్, ఇటీవల వెలువడిన కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనల కారణంగా ఎఫ్‌సీఆర్ఏ (Foreign Contribution Regulation Act – FCRA) పర్మిట్ పొందాల్సిన పరిస్థితి వచ్చింది. 2010లో అమల్లోకి వచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో కేంద్రం తాజాగా పలు మార్పులు చేసింది. ఆ మార్పుల ప్రకారం, దేశంలోని అన్ని ట్రస్ట్‌లు, సేవా సంస్థలు విదేశీ విరాళాలు స్వీకరించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే, విరాళాల పారదర్శక వినియోగంపై కూడా అదనపు నియంత్రణలు అమల్లోకి తెచ్చారు.
ఈ నేపథ్యంలో, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి ప్రత్యేకంగా లేఖ రాయబడింది. ప్రజల ఆరోగ్య సేవలు, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించడం, నేత్రదానం ప్రోత్సహించడం వంటి ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యకలాపాల ప్రాధాన్యతను వివరించారు. విదేశీ విరాళాలు అందితే సేవల విస్తరణ సులభమవుతుందని, మరింత మంది అవసరమైన వారికి సహాయం చేయగలమని ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అభ్యర్థనపై పరిశీలన అనంతరం కేంద్రం ఎఫ్‌సీఆర్ఏ అనుమతి ముద్ర వేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీతో, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్న అభిమానులు, దాతలు నుంచి కూడా విరాళాలు తీసుకునే హక్కు పొందింది. మరింత ఆధునిక వైద్య పరికరాలు, అత్యవసర సేవలు, ఉచిత వైద్య శిబిరాలు వంటి సేవలను విస్తరించుకునేందుకు ఇది ఎంతో దోహదం కానుందని భావిస్తున్నారు.
స్థాపితమైన నాటి నుంచీ లక్షలాది మంది ప్రజలకు సేవలు అందిస్తున్న CCT, రక్తం అందించే అత్యంత విశ్వసనీయమైన ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రతి రోజు వందలాది మంది రోగులకు రక్తం అందించడంలో ఈ ట్రస్ట్ కీలక పాత్ర పోషిస్తోంది. నేత్రదానుల నమోదులో కూడా ఈ ట్రస్ట్ దేశంలోనే అగ్రగామిగా ఉంది. కేంద్రం ఇచ్చిన ఈ కొత్త అనుమతితో, చిరంజీవి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, అభిమానులు తమ వంతు సహాయం అందించే అవకాశం పొందటంతో, ట్రస్ట్ కార్యకలాపాలు కొత్త దశలోకి అడుగుపెట్టనున్నాయి.
