పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పీరియాడిక్ చిత్రం ‘హరి హర వీర మల్లు’. ఈ చిత్రం ఈనెల 24న థియేటర్లలో విడుదల కానున్నది. నాలుగైదు సంవత్సరాల నుంచి సినిమా పవన్ అభిమానులను ఊరిస్తున్నది. రెండు, మూడు సార్లు సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ కావడం కూడా అభిమానులను నిరాశ పరిచింది. ఎట్టకేలకు ఈ నెల చిత్రం విడుదలవుతున్నది. దీంతో అభిమానుల్లో చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. భారీ బడ్జెట్ తీసిన ఈ చిత్రంపై మేకర్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అయితే.. ఏపీలో చిత్రానికి టికెట్ ధరలు పెంచుకునేందుకు అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 10 రోజుల వరకు రేటు పెంచుకునే అవకాశం ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో లోయర్ క్లాస్‌పై రూ.100, అప్పర్ క్లాస్‌పై రూ.150 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇక మల్టీప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ధరలపై జీఎస్టీ అదనంగా వసూలు చేయొద్దని, జీఎస్టీ కలుపుకొనే టికెట్ ధర నిర్ణయించామని సర్కార్ స్పష్టం చేసింది.
మరోవైపు తెలంగాణలో టిక్కెట్ రేట్లు పెంచేందుకు అవకాశ కల్పించాలని మేకర్స్ తాజాగా రాష్ట్ర సర్కారుకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.