Potti Sri Ramulu: తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే సంకల్పంతో తన ప్రాణాలనే అర్పించి లక్ష్యాన్ని సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు (Potti Sri Ramulu)అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సీఎం ఘన నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన అపూర్వ త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్టు చేశారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని, దేశం కోసం అహింసా మార్గంలో పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి కీలక ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర్య సంగ్రామానికి తనవంతు సేవలందించిన ధీరోదాత్తుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే దృఢ సంకల్పంతో పొట్టి శ్రీరాములు చేసిన నిరాహార దీక్ష దేశ చరిత్రలో కీలక మలుపుగా మారిందని సీఎం అన్నారు.
తన ఆరోగ్యం, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సాధ్యమైందని తెలిపారు. ఆయన త్యాగం లేకపోతే భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఇంత త్వరగా మార్గం సుగమమయ్యేదేమోనని అభిప్రాయపడ్డారు. పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం కేవలం ఒక రాష్ట్ర అవతరణకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అనే చారిత్రక ప్రక్రియకు నాంది పలికిందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాంటి మహనీయుడి జీవితం ప్రతి తెలుగువారికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన త్యాగబాటను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. తన ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల కోసమే జీవించిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు జాతి గర్వకారణమని సీఎం అన్నారు. అటువంటి మహానుభావుడికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మరోసారి ఘన నివాళులు అర్పిస్తున్నానని చంద్రబాబు నాయుడు తన సందేశంలో తెలిపారు.
