India Gate: ఢిల్లీ(Delhi)లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ ఇండియా గేట్ బుధవారం ఉదయం గాఢమైన పొగమంచు(fog) మరియు పెరుగుతున్న వాయు కాలుష్యం(Air pollution)తో పూర్తిగా కనుమరుగైపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. కర్తవ్య పథ్(Kartavya Path) వద్ద నిలుచున్న వారికే ఇండియా గేట్ కనిపించకపోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా స్పష్టంగా కనిపించే ఈ చారిత్రక నిర్మాణం చుట్టూ తెల్లని పొగమంచు కమ్ముకోవడంతో, “ఇండియా గేట్ ఎక్కడికి మాయమైందబ్బా?” అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో పొగమంచు అతి తీవ్రంగా ఉండటంతో, ఇండియా గేట్ ఉన్న దిశలో కేవలం మసకబారిన వెలుతురే కనిపిస్తోంది.
దీనికి తోడు వాయు కాలుష్యం స్థాయిలు కూడా భారీగా పెరగడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని పలువురు సోషల్ మీడియా వేదికల్లో పేర్కొంటున్నారు. “పొగమంచు మాత్రమే కాదు, కాలుష్యమే అసలు కారణం” అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాజధానిలో పరిస్థితులు ఏ స్థాయికి చేరుకున్నాయో ఈ వీడియో స్పష్టంగా చెబుతోందని వారు అంటున్నారు. ఇక, మొత్తంగా చూస్తే, దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 377 గా నమోదైందని అధికారులు వెల్లడించారు. ఇది ‘తీవ్ర కాలుష్యం’ (Severe) వర్గంలోకి వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే AQI 400 పాయింట్లను దాటుతూ ‘గంభీరం’ స్థాయికి చేరిందని పర్యావరణ శాఖ తెలిపింది. ఇలాంటి కాలుష్య పరిస్థితుల్లో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాయు కాలుష్యం పెరుగుతున్న కొద్దీ ఢిల్లీ వాసుల ఆరోగ్యం దెబ్బతింటోంది. పిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారిపై ప్రభావం ఇంకా ఎక్కువగా పడుతోంది. జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, పొడి దగ్గు, కళ్లల్లో మంట, తలనొప్పి వంటి లక్షణాలతో ఆసుపత్రులను సంప్రదించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కాలుష్య స్థాయిలు తగ్గకపోతే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. పాఠశాలలు, ఆఫీసులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేస్తోంది. ప్రజలు అవసరమైతే తప్ప బయట తిరగకూడదని, బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండియా గేట్ కనిపించనంతగా పొగమంచు మరియు కాలుష్యం ఢిల్లీని కమ్మేయడం దేశ వ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. రాజధానిలో కాలుష్యం నియంత్రణకు తక్షణ చర్యలు అవసరమనే అభిప్రాయాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
VIDEO | Delhi: India Gate invisible behind a curtain of haze as the national capital continues to witness poor air quality. Early morning visuals from India Gate and Kartavya Path areas. #DelhiPollution #WeatherUpdate #airqualityindex
(Full video available on PTI Videos -… pic.twitter.com/o1Y8b60wDr
— Press Trust of India (@PTI_News) December 3, 2025
