Donald Trump: రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం( Russia – Ukrainewar) కొనసాగిస్తుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్, “భారత ప్రధాని నరేంద్ర మోదీ( PM Modi) రష్యా నుంచి ఇకపై చమురు కొనడాన్ని ఆపుతామని తనకు హామీ ఇచ్చారు” అంటూ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా రష్యాపై ఆర్థిక ఒత్తిడిని పెంచే దిశగా ఒక కీలక ముందడుగు అని ట్రంప్ అభివర్ణించారు. “భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండడంపై నేను అసంతృప్తితో ఉన్నాను. అయితే మోదీ గారు ఈరోజు నాతో మాట్లాడుతూ ఇకపై చమురు కొనబోమని స్పష్టంగా తెలిపారు. ఇది రష్యాను ఒంటరిగా వదిలేసే మా ప్రయత్నాల్లో ఒక గొప్ప విజయం” అని పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు ప్రత్యేకంగా ప్రాధాన్యం సంతరించుకోవడంలో ప్రధాన కారణం రష్యా చమురు మార్కెట్లో భారత్ ఒక ప్రధాన వినియోగదారుగా ఉండటం. భారత్ తీసుకునే నిర్ణయం ఇతర అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపే అవకాశముంది. ప్రత్యేకించి చైనా వంటి దేశాలపై కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. ఆయన చైనాను కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేలా ఒప్పిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇంకా స్పందించలేదు. మోదీ వాస్తవంగా ఇలాంటి హామీ ఇచ్చారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు, మోదీ ప్రభుత్వ అధికారిక ప్రతినిధులు ఇప్పటివరకు ఈ వ్యాఖ్యలపై ఎలాంటి వ్యాఖ్యనాలకీ తెరలేపలేదు. ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఒక విషయాన్ని స్పష్టంగా చేశారు. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు కాదు. దీని కోసం కొంత సమయం పడుతుంది. కానీ ఇది త్వరలోనే అమలులోకి వస్తుందని నేను నమ్ముతున్నాను అని చెప్పారు.
ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా చమురు ఆదాయాన్ని తగ్గించేందుకు పశ్చిమ దేశాలు క్రమంగా చర్యలు తీసుకుంటున్నాయి. అలాంటి సమయంలో భారత్ లాంటి దేశం నుంచి వచ్చిన ఈ ప్రకటన (ఒప్పుకున్నట్లయితే) రష్యాపై తీవ్ర ప్రభావం చూపేలా ఉండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఇక ట్రంప్ వ్యాఖ్యలు నిజమైతే, భారత్ తీసుకునే ఈ నడక ప్రపంచ ఇంధన దౌత్యంలో ఒక కీలక మలుపు కావొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
