IndiGo: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో(Airline IndiGo) ఇటీవల తలెత్తిన కార్యకలాపాల సంక్షోభంపై సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయిస్తూ పిటిషన్(Petition) దాఖలైంది. గత కొద్దిరోజులుగా 1,000కు పైగా విమానాలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే న్యాయస్థానం జోక్యం అవసరమని ఈ పిటిషన్‌లో డిమాండ్ చేశారు. ‘ఇండిగో ఆల్ ప్యాసింజర్ అండ్ అనదర్’ పేరుతో న్యాయవాది నరేంద్ర మిశ్రా దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో, విమానాల రద్దు మరియు దీర్ఘకాలిక ఆలస్యాల కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో అసలు మానవతా సంక్షోభం నెలకొన్నదని వర్ణించారు. ఆహారం, నీరు, విశ్రాంతి వసతులు లేకుండా గంటల తరబడి టర్మినల్స్‌లో వేచి ఉండాల్సి వస్తున్న వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుల దుస్థితిని పిటిషన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ పరిస్థితులు పౌరుల జీవన హక్కును రక్షించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.పైలట్ల కోసం తాజాగా అమల్లోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనల అమలు సమయంలో సంస్థలో తగిన ప్రణాళికలేకపోవడం వల్లే ఈ భారీ అంతరాయాలు ఏర్పడ్డాయని ఇండిగో స్వయంగా అంగీకరించిన విషయాన్నీ పిటిషన్‌లో గుర్తుచేశారు. అయితే, ఈ మార్పులను ముందుగా అంచనా వేసి అవసరమైన సన్నాహాలు చేయడంలో ఇండిగో మాత్రమే కాకుండా ప్రభుత్వ నియంత్రణ సంస్థ DGCA కూడా విఫలమైందని పిటిషన్ ఆరోపించింది. సంక్షోభాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొన్ని కీలక మార్గాల్లో టికెట్ ధరలను ఆకాశానికెత్తి రూ.50,000 వరకు వసూలు చేయడం ద్వారా ప్రయాణికులను బందీలుగా మార్చిందని పిటిషన్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అనవసరంగా ధరలు పెంచడం అనైతిక వ్యాపార ప్రవర్తనగా పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అత్యవసర విచారణ కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. అలాగే, ఇప్పటికే రద్దు చేసిన విమానాల కారణంగా ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఇతర విమానాల్లో లేదా రైళ్లలో ఎటువంటి అదనపు ఛార్జీలేమీ లేకుండా ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు కల్పించాలనే దిశగా ఇండిగోకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. అంతేకాకుండా, ప్రస్తుత సంక్షోభంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను DGCA మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి సుప్రీంకోర్టు కోరేలా ఆదేశించాల్సిందిగా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. సంక్షోభ తీవ్రత దృష్ట్యా, విమానయాన రంగంలో భవిష్యత్‌లో ఇలాంటి అవ్యవస్థలు పునరావృతం కాకుండా సమగ్ర పరిశీలన అవసరమని పిటిషన్ స్పష్టం చేసింది.
