PSLV-C62 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO ) మరో కీలకమైన వాణిజ్య ప్రయోగానికి సమాయత్తమైంది. దేశ అంతరిక్ష రంగానికి మరింత ప్రతిష్ట తెచ్చేలా, PSLV-C62 వాహక నౌకను జనవరి 12 ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగంతో ఇస్రో అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాల జాబితాలో మరో విజయాన్ని నమోదు చేయనుంది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇది తొమ్మిదవ వాణిజ్య మిషన్. ఈ మిషన్‌లో ప్రధానంగా EOS-N1 భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు, దేశీయ మరియు విదేశీ వినియోగదారులకు చెందిన మరో 15 చిన్న ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
భూమి పరిశీలన, డేటా సేకరణ, కమ్యూనికేషన్ వంటి అవసరాలకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడనున్నాయి. ప్రస్తుతం PSLV-C62 వాహక నౌకకు సంబంధించిన అనుసంధాన పనులు పూర్తయ్యాయి. లాంచ్‌కు ముందు నిర్వహించాల్సిన సాంకేతిక పరీక్షలు, భద్రతా తనిఖీలు శరవేగంగా కొనసాగుతున్నాయి. శాస్త్రవేత్తలు ప్రతి దశను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, ప్రయోగం నిర్ధిష్ట సమయానికి విజయవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. PSLV సిరీస్‌లో ఇది 64వ ప్రయోగం కావడం విశేషం. ఈ మిషన్‌లో రెండు సాలిడ్ స్ట్రాప్-ఆన్ మోటార్లు కలిగిన ‘PSLV-DL’ వేరియంట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది భారమైన లోడును ఖచ్చితమైన కక్ష్యలోకి చేర్చగల సామర్థ్యం కలిగి ఉంది.
ఈ ప్రయోగంలో ప్రత్యేక ఆకర్షణగా స్పెయిన్‌కు చెందిన స్టార్టప్ అభివృద్ధి చేసిన ‘KID’ అనే రీ-ఎంట్రీ వెహికల్ ప్రోటోటైప్ నిలవనుంది. ఇది తన లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా పడనుంది. భవిష్యత్తులో రీ-ఎంట్రీ సాంకేతికత అభివృద్ధికి ఇది కీలకంగా ఉపయోగపడనుంది. చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-L1 వంటి చారిత్రాత్మక మిషన్లతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన PSLV, ఇస్రోకు అత్యంత నమ్మకమైన వాహక నౌకగా పేరొందింది. ఈ తాజా వాణిజ్య ప్రయోగంతో భారత్ అంతరిక్ష రంగంలో తన స్థిరమైన సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటనుంది.
