Justice Surya Kant: సుప్రీంకోర్టు(Supreme Court) 53వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జస్టిస్ సూర్యకాంత్‌లో సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఆదివారం జస్టిస్ బి.ఆర్. గవాయ్(Justice B.R. Gavai) పదవీకాలం పూర్తవడంతో, ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టారు. భారత సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా హరియాణా (Haryana)రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి సీజేఐగా నియమితులయ్యాడు అనే ప్రత్యేక రికార్డు ఆయన ఖాతాలో చేరింది. ఆయన 2027 ఫిబ్రవరి 9 వరకు ఈ అత్యున్నత పదవిలో కొనసాగనున్నారు. 1962 ఫిబ్రవరి 10న హరియాణా రాష్ట్రంలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ విద్యాభ్యాసంలోనూ, న్యాయ రంగంలోనూ ప్రతిభను ప్రదర్శించారు.
1981లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన, 1984లో రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో ఎల్.ఎల్.బీ పట్టా సంపాదించారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి, కొద్ది సంవత్సరాల్లోనే విశిష్ట న్యాయవాదిగా పేరు పొందారు. 1985లో పంజాబ్, హరియాణా హైకోర్టు బార్‌లో చేరిన ఆయన, 2001లో సీనియర్ అడ్వకేట్ హోదా పొందడం ద్వారా మరో కీలక స్థాయికి చేరుకున్నారు. అనంతరం, 2004 జనవరి 9న పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయవ్యవస్థ పట్ల ఆయన చూపిన నిబద్ధత, తీర్పుల్లో ప్రతిఫలించిన న్యాయబద్ధత ఆయన ఖ్యాతిని మరింత పెంచాయి. దాదాపు రెండు దశాబ్దాల న్యాయపరమైన ప్రయాణంలో జస్టిస్ సూర్యకాంత్ అనేక కీలక తీర్పుల్లో భాగమై ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు.
2019 మే 24న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడం ఆయన న్యాయ ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ అత్యున్నత న్యాయస్థానాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నారని న్యాయవర్గాల అంచనా. న్యాయవ్యవస్థ సంస్కరణలు, పెండింగ్ కేసుల తగ్గింపు, సాధారణ ప్రజలకు న్యాయం అందుబాటులోకి తెచ్చే అంశాలను ఆయన ప్రాధాన్యంగా తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు నాయకత్వం కొత్త దశలోకి అడుగుపెట్టిన ఈ సందర్భంలో, జస్టిస్ సూర్యకాంత్ నియామకం న్యాయవ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
