Tamil Nadu: తమిళ సినీ నటుడు, రాజకీయ నేత విజయ్(Vijay)ను కేంద్రంగా చేసుకుని కరూర్ తొక్కిసలాట కేసు(Karur stampede case) రోజురోజుకీ మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది. గత ఏడాది కరూర్‌లో జరిగిన ఈ ఘోర ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), విజయ్‌ను నేరుగా విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని ఆయనకు సమన్లు జారీ( summons Issuance) చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కరూర్‌లో జరిగిన బహిరంగ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో బాధ్యులను గుర్తించాలనే లక్ష్యంతో సీబీఐ విచారణను మరింత లోతుగా కొనసాగిస్తోంది.
ఈ కేసులో భాగంగా విజయ్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సును సైతం అధికారులు స్వాధీనం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సభ జరిగిన రోజున ఆ వాహనం ప్రయాణించిన మార్గం, సమయాలు, అధికారిక అనుమతులు, భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కీలక ఆధారాలు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ను కూడా విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అంచనాలకు మించి జనం తరలిరావడం, సరైన జన నియంత్రణ చర్యలు లేకపోవడం వల్ల తీవ్ర తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో అనేక మంది తీవ్రంగా గాయపడగా, 41 మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ విచారణ ప్రారంభించినప్పటి నుంచి పలువురు కీలక వ్యక్తులను ప్రశ్నించింది. నవంబర్ 25న టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో పాటు ఇతర ముఖ్య నేతలను విచారించిన అధికారులు, సభ ఏర్పాట్లు, భద్రతా బాధ్యతలపై వివరాలు రాబట్టారు. డిసెంబర్ 4న కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేలంను రెండు గంటల పాటు ప్రశ్నించి, సభకు ఇచ్చిన అనుమతులు, పోలీస్ బందోబస్తు అంశాలపై ఆరా తీశారు. ఇప్పుడు నేరుగా విజయ్‌ను విచారించడం ద్వారా సభ నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలు, భద్రతా ఏర్పాట్లపై తుది స్థాయిలో స్పష్టత రావచ్చని సీబీఐ భావిస్తోంది. ఈ విచారణ అనంతరం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ, న్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
