Prabhakar Rao: తెలంగాణ రాజకీయాలను గట్టిగా కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు(Prabhakar Rao)ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వారాల పాటు కస్టడీలో విచారణ జరిపిన అనంతరం గడువు పూర్తికావడంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఆయనను విడిచిపెట్టారు. సుప్రీంకోర్టు సూచనలతో ఈ నెల 12న ప్రభాకర్ రావు స్వయంగా సిట్ ఎదుట లొంగిపోయారు. అనంతరం అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణ సమయంలో ఆయన పూర్తిగా సహకరించడం లేదన్న కారణంతో సిట్ కస్టడీ గడువును పొడిగించినట్లు సమాచారం.
ముఖ్యంగా పదవీ విరమణ అనంతరం కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను ఎస్ఐబీ చీఫ్‌గా కొనసాగించడంపై సిట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు, దురుద్దేశాలు ఉన్నాయా అనే కోణంలో ప్రశ్నలు సంధించింది. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావుతో తరచూ సమావేశాలు ఎందుకు జరిగాయన్న అంశంపైనా సిట్ విచారించింది. దీనికి ప్రభాకర్ రావు మావోయిస్టుల ముప్పు, భద్రతా అంశాలపై చర్చించేందుకే ఆ భేటీలు జరిగాయని వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో భాగంగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అంతేకాదు, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ వంటి ఉన్నతాధికారుల వాంగ్మూలాలను కూడా సిట్ నమోదు చేసింది.
ప్రభాకర్ రావు కస్టడీలో జరిగిన విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను జనవరి 16న సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సిట్ సిద్ధమవుతోంది. ఈ నివేదికలో కీలక విషయాలు, తదుపరి చర్యలపై సూచనలు ఉండనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ కేసులో ముందడుగులపై చర్చించేందుకు ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ భేటీ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కూడా విచారణకు పిలిచే అవకాశముందన్న ఊహాగానాలు ఊపందుకోవడంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లను ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందం అక్రమంగా ట్యాపింగ్ చేసిందన్న ఆరోపణలే ఈ కేసుకు కేంద్రబిందువుగా మారాయి. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
