Komatireddy Venkat Reddy: తెలంగాణ భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ పర్యటన( Andhra Pradesh Tour)కు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ రైజింగ్ సమ్మిట్’(Telangana Rising Summit)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యంగా చెప్పబడుతోంది. అయితే ఇటీవల రెండు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కోమటిరెడ్డి, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం, ఈ పర్యటనకు ఈ పర్యటన రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ కోనసీమ ప్రాంత అభివృద్ధి విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ నాయకుల ‘దృష్టి’ పడిందేమోనని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
దీనికి ప్రతిగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో స్పందిస్తూ, పవన్ కల్యాణ్ సినిమాలను తెలంగాణలో విడుదల కాకుండా ఆపెయ్యాలని హెచ్చరించారు. ఈ ఘాటు వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కొత్త ఉద్రిక్తత నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డి ఏపీ పర్యటన మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన ఈ సందర్శనలో పవన్ కల్యాణ్‌ను కలుసుకుంటారా, లేక పూర్తిగా అధికారిక కార్యక్రమాలకే పరిమితం అవుతారా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కలయిక జరిగితే అది రెండు రాష్ట్రాల రాజకీయ సంబంధాలపై ప్రభావం చూపవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇక తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌పై తెలంగాణ ప్రభుత్వం అత్యంత శ్రద్ధ చూపుతోంది. ఈ సమ్మిట్‌ను విజయవంతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలను వ్యక్తిగతంగా ఆహ్వానించారు. అంతర్జాతీయ స్థాయి వేడుకగా ఈ సదస్సును రూపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో పాటు పలువురు ప్రసిద్ధ అంతర్జాతీయ వ్యక్తులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారని అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ నేపధ్యంలో కోమటిరెడ్డి పర్యటన కేవలం ఆహ్వాన కార్యక్రమం మాత్రమే కాక, రాజకీయ ప్రవాహాలు ఎలా మారతాయో సూచించే సంకేతాలుగా కూడా భావించబడుతోంది. ఆయన ఏపీ నేతలతో జరిపే సంభాషణలు, ఇచ్చే సందేశాలు, పవన్ కల్యాణ్ అంశంపై తీసుకునే వైఖరి – ఇవన్నీ రాబోయే రోజుల రాజకీయ చర్చలకు బాటలు వేయనున్నాయి.
