Mallojula Venugopal: మావోయిస్టు(Maoist) ఉద్యమానికి తీవ్ర పరాజయంగా అభివర్ణించదగిన పరిణామం గడ్చిరోలిలో చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal)అలియాస్ సోను ఆయుధాలు విసర్జించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అతనితో పాటు సుమారు 60 మంది మావోయిస్టు క్యాడర్లు కూడా మహారాష్ట్ర(Maharashtra)లోని గడ్చిరోలిలో మంగళవారం తమ ఆయుధాలను అధికారుల ఎదుట వదిలేసినట్లు సమాచారం. ఇది మావోయిస్టు శక్తికి గట్టి దెబ్బగా మారింది. ఇప్పటికే ఈ ఏడాది సెప్టెంబరులో మల్లోజుల ఒక సంచలనాత్మక ప్రకటన చేశాడు. ఆయుధాలను వదిలేసి శాంతి చర్చల వైపు అడుగులు వేయాలని, అనవసర హింసను మానేయాలని పిలుపునిచ్చాడు. ఆయన ప్రకటనకు మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతిచ్చినా, టాప్ లీడర్లలో హిడ్మా, దేవ్‌జీ వంటి వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఇంటర్నల్ విభేదాల దృష్ట్యా మల్లోజుల కొన్ని రోజుల క్రితం మరో లేఖ విడుదల చేయడం గమనార్హం.
ఆ లేఖలో మల్లోజుల స్పందిస్తూ..ఇంత నష్టానికి, ఇన్ని బలిదానాలకు దారితీసిన విప్లవోద్యమ బాధ్యతల్లో కొనసాగడానికి తాను ఇక అర్హుడిని కాదని భావిస్తున్నాను. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో నేను తీసుకున్న నిర్ణయం సరికాదు అనిపించొచ్చు. కానీ, వాస్తవ పరిస్థితులు ఇలా చేయాల్సిన అవసరాన్ని తెచ్చాయి అని పేర్కొన్నారు. అలానే వందలాది మంది మావోయిస్టులను కోల్పోతున్న సమయంలో, పార్టీ పిడివాద మరియు అతివాద ధోరణులు మిగిలిన క్యాడర్లను కూడా నాశనం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ముందుకు నడిపించాలంటే, ప్రజల్లోకి బహిరంగంగా వెళ్లడం మినహా మరో మార్గం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఉద్యమ పరాజయానికి బాధ్యత స్వీకరిస్తున్నాను. రాజకీయ విప్లవం పేరు మీద నిష్ప్రయోజకంగా మారిన మార్గాన్ని వదిలి, ప్రజల సహకారంతో శాంతి మార్గంలో పయనించాలి అని మల్లోజుల వివరించారు.
తన రాజీనామాను పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ప్రకటిస్తూ, ఉద్యమం పునర్నిర్మాణానికి రాజకీయ చర్చల అవసరాన్ని గట్టిగా పేర్కొన్నాడు. ఆయుధాల విసర్జన ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మళ్ళీ వస్తానని సంకేతాలు ఇచ్చాడు. మొత్తానికి, మల్లోజుల వేణుగోపాల్ వంటి కీలక నేత ఆయుధాలు వదిలేయడమొక చారిత్రక మలుపుగా చెప్పొచ్చు. మావోయిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న అంతర్గత సంక్షోభానికి ఇది బలమైన సంకేతం. మావోయిస్టు ఉద్యమం గత రెండు దశాబ్దాలుగా భద్రతా బలగాలను తీవ్రంగా సవాల్ చేస్తూ వచ్చినా, ఈ తాజా పరిణామం ఆ ఉద్యమ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది.