end
=
Wednesday, December 31, 2025
వార్తలురాష్ట్రీయంఏపీని పెట్టుబడులకు ఎంచుకోవడానికి మూడు కారణాలు తెలిపిన మంత్రి లోకేశ్‌
- Advertisment -

ఏపీని పెట్టుబడులకు ఎంచుకోవడానికి మూడు కారణాలు తెలిపిన మంత్రి లోకేశ్‌

- Advertisment -
- Advertisment -

AP: ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఎందుకు నిలుస్తుందో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Minister Nara Lokesh)వివరించారు. విశాఖపట్నం (Visakhapatnam)లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు గురువారం ఘనంగా ఆరంభమైంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రత్యేక అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. సదస్సు సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ..ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ మారుతున్న ఈ సమయంలో, దేశవ్యాప్తంగా ప్రముఖులు పాల్గొనే సీఐఐ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని తెలిపారు. పెట్టుబడిదారులు తరచూ “ఏపీని ఎందుకు ఎంచుకోవాలి?” అని అడిగితే, దానికి మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని ఆయన వివరించారు.

మొదటి కారణం “నాయకత్వం”..అనుభవం, దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ కనిపించని అవకాశంగా, ప్రజలు చంద్రబాబుకు మరోసారి కొత్త వారసత్వం నిర్మించే అవకాశం ఇచ్చారు. అమరావతి, విశాఖపట్నం వంటి నగరాలను ప్రపంచ స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఆయన సంకల్పించారు అని లోకేశ్ చెప్పారు.

రెండో కారణం.. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మంత్రి ప్రస్తావించారు. ప్రపంచం వేగంగా మారుతోంది. ఆ మార్పులను అనుసరించి పాలన కూడా వేగవంతంగా సాగాలి. పెట్టుబడిదారులు కోరుకున్న భూకేటాయింపులు, అనుమతులు, ప్రోత్సాహకాలు ప్రతి దశలోనూ ఆలస్యం లేకుండా స్పందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీ కంపెనీ స్పీడ్ కన్నా, ప్రభుత్వం స్పీడ్ ఎక్కువగా ఉంటుంది అనేది మా హామీ. ఒకసారి ఏపీతో చేయి కలిపిన తరువాత, మీ ప్రాజెక్ట్‌ మా ప్రభుత్వ ప్రాజెక్ట్‌గా మారుతుంది అని ఆయన స్పష్టం చేశారు.

మూడో కారణం ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం’ ఉన్నదని లోకేశ్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు మార్గనిర్దేశకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన విధాన మార్పులు, సంస్కరణలను అమలు చేయడంలో కేంద్రంతో సన్నిహితంగా పనిచేస్తామని తెలిపారు. చివరిగా, వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామన్న విశ్వాసాన్ని లోకేశ్ వ్యక్తం చేశారు. పెట్టుబడిదారుల కోసం భద్రత, పారదర్శకత, వేగవంతమైన సేవలు కల్పించడంలో ఏపీ ముందంజలో ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -