Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) త్వరలో ఆస్ట్రేలియా (a)Australiలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఆ దేశ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానానికి అనుగుణంగా, ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూపుతున్న పురోగతిని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం, తమ ‘స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్’లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేశ్‌కు ఆహ్వానం పంపింది. ఇటీవలే ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఈ మేరకు అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.
ఈ పర్యటనలో భాగంగా, మంత్రి లోకేశ్ రెండు ప్రధాన అంశాలపై దృష్టి సారించనున్నారు. మొదటిగా, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పెట్టుబడుల ఆహ్వానానికి సంబంధించి సిడ్నీ, మెల్‌బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, మనవ వనరుల ప్రత్యేకతలను విదేశీ పరిశ్రమలకు వివరిస్తారు. ఇంకొక ముఖ్య అంశంగా, ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను సందర్శించి, వారి ఆధునిక విద్యా విధానాలు, నైపుణ్యాభివృద్ధిపై అధ్యయనం చేయనున్నారు. ఇందులో యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, గ్రిఫిత్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయ.
అలాగే, పర్యటన సందర్భంగా ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో లోకేశ్ సమావేశం కానున్నారు. వీరిలో స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్, ఇన్నొవేషన్ అండ్ టెక్నాలజీ మంత్రి అనౌలాక్ చాంతివోంగ్, విక్టోరియన్ స్కిల్స్ మంత్రి బెన్ కరోల్ లాంటి ప్రముఖులు ఉన్నారు. ఈ సమావేశాల్లో నైపుణ్యాభివృద్ధి, విద్య, పరిశ్రమల సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి. మరింతగా, బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ఈ సమావేశాలు కీలకంగా నిలవనున్నాయి.
ఈ పర్యటనలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కూడా లోకేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. మెల్‌బోర్న్, విక్టోరియా క్రికెట్ స్టేడియంలను సందర్శించి, ఆధునిక క్రీడా మైదానాల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై అక్కడి ప్రముఖ ఆర్కిటెక్ట్‌లతో చర్చించనున్నారు. రాష్ట్రంలో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇది ఉపయుక్తంగా నిలుస్తుందని అంచనా. ఈ నెల 19న సిడ్నీలో నిర్వహించే తెలుగు ప్రవాసుల ప్రత్యేక సమావేశంలో లోకేశ్ పాల్గొననున్నారు. అనంతరం, 24వ తేదీ రాత్రి ఆయన పర్యటన ముగించుకొని, 25వ తేదీన హైదరాబాద్‌కు తిరిగి చేరుకుంటారు. ఈ పర్యటన రాష్ట్రానికి విద్య, ఐటీ, పరిశ్రమ, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కొత్త దారులు వేసే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
