Miss Universe 2025 : థాయ్‌లాండ్(Thailand)లో అద్భుతంగా నిర్వహించిన 74వ మిస్ యూనివర్స్ గ్రాండ్ ఫైనల్లో (74th Miss Universe Grand Finale)మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్(Fatima Bosch) అద్భుత విజయంతో విశ్వసుందరిగా ఎంపికయ్యారు. పోటీల ఆరంభం నుంచే తన వ్యక్తిత్వం, నైపుణ్యం, అందంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె, ఫైనల్ రౌండ్లలోనూ తన ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించి ప్రపంచ సుందరులలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. గత ఏడాది విజేత డెన్మార్క్ అందాల రాణి విక్టోరియా క్జార్ థెల్విగ్ ఈ వేడుకలో ఫాతిమాకు కిరీటాన్ని అలంకరించడంతో వేదికపై క్షణాల్లోనే ఆనందం అలుముకుంది. 25 ఏళ్ల ఫాతిమా బోష్ స్వదేశంలోనే కాదు, అంతర్జాతీయ వేదికపైన కూడా మంచి ఫాలోయింగ్ మరియు గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో మిస్ యూనివర్స్ మెక్సికో 2025గా ఎంపికైన తరువాత ఫాతిమా ప్రపంచ అందాల పోటీలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు ప్రత్యేకమైన సన్నాహాలు చేసుకున్నారు.
ఆమె తన అందం మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం, సామాజిక బాధ్యతాభావంతో కూడిన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం వల్ల పోటీ ప్రారంభ దశ నుంచే ఫేవరెట్‌గా నిలిచారు. అయితే, ఫైనల్స్‌కు మునుపు జరిగిన ఒక సంఘటన ఆమెను ప్రత్యేకంగా హెడ్లైన్స్‌లో నిలబెట్టింది. రిహార్సల్స సమయంలో థాయ్‌లాండ్‌కు చెందిన ఒక పేజెంట్ డైరెక్టర్ తనపై కోపంతో అరుస్తూ వ్యవహరించారని ఫాతిమా ఆరోపించారు. ఈ సంఘటనతో అసహనం చెందిన ఆమె ఈవెనింగ్ గౌన్, హీల్స్‌లోనే వేదికను విడిచి వెళ్లడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఘటన కాసేపే సంచలనం సృష్టించింది. అయితే, పరిస్థితిని సమీక్షించుకున్న ఫాతిమా త్వరగానే తిరిగి రిహార్సల్స్‌లో పాల్గొని తన వృత్తిపర నిబద్ధతను చాటుకున్నారు.
ఆమె ఈ ప్రవర్తనే విమర్శకులనూ, అభిమానులనూ ఆకట్టుకుంది. ఒక అందాల పోటీలో కేవలం అందం మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, మానసిక శాంతి, పరిస్థితులు ఎలా ఉన్నా లక్ష్యంపై దృష్టి నిలుపుకోవడం వంటి లక్షణాలు ఎంతో ముఖ్యమని ఫాతిమా నిరూపించారు. ఫైనల్ క్వషన్–ఆన్సర్ రౌండ్‌లోనూ ఆమె ధైర్యంగా, స్పష్టంగా సమాధానమిచ్చి జడ్జీలను ప్రభావితం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మెక్సికోకు ప్రతిష్ట తీసుకువచ్చిన ఫాతిమా విజయంతో మెక్సికోలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఆమె విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతులకు ప్రేరణగా నిలుస్తోంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి, మెరుగైన మార్గాన్ని ఎంచుకుంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఫాతిమా బోష్ విశ్వసుందరి 2025గా నిలిచి మరోసారి నిరూపించారు.
