దేశ ప్రజల గుండెల్లో తాతగారు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఎప్పుడూ ఉంటారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ నెహ్రూజీ జయంతి. ఈ సందర్భంగా రాహుల్ తన తాతయ్య సమాధి వద్ద పుష్ప గుచ్చాలుంచి నివాళులు అర్పించారు. ఢిల్లీలోని శాంతివనం వద్దకు చేరిన రాహుల్ నెహ్రూకు నివాళి తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. సోదరభావం, ఆధునిక దృక్పథం, అత్యున్నత విలువలతో దేశానికి పునాది వేసిన వ్యక్తి నెహ్రూజీ అని రాహుల్ అన్నారు. అత్యున్నత దూరదృష్టి కలిగిన వ్యక్తి నెహ్రూజీ అని రాహుల్ కీర్తించారు. నెహ్రూకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టమన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. దేశ ప్రథమ ప్రధాని దివంగత నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రధాని మోది ట్విట్టర్ ద్వారా స్పందించారు.