MGNREGA: దేశ గ్రామీణ ఉపాధి రంగం(Rural employment sector)లో కేంద్ర ప్రభుత్వం(Central Govt) చారిత్రక మార్పులకు శ్రీకారం చుట్టింది. గత రెండు దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో పూర్తిగా కొత్త చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. “వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB–G RAM G) బిల్లు, 2025” పేరుతో రూపొందించిన ఈ బిల్లును త్వరలో లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వికసిత భారత్ 2047 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ప్రభావవంతంగా మార్చడమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. MGNREGA ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగినప్పటికీ, అమలులో అనేక లోపాలు ఉన్నాయని కేంద్రం అభిప్రాయపడుతోంది. నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరు వ్యవస్థలో అవకతవకలు, చేపట్టిన పనులకు ఖర్చులకు మధ్య పొంతన లేకపోవడం వంటి సమస్యలు వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీశాయని పేర్కొంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆధునిక సాంకేతికతతో, మరింత పారదర్శకతతో కూడిన కొత్త చట్టం అవసరమని కేంద్రం భావించింది. కొత్త బిల్లులో కీలకమైన మార్పుల్లో మొదటిది పని దినాల పెంపు. ఇప్పటివరకు ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి హామీ ఉండగా, VB–G RAM G బిల్లులో దీనిని 125 రోజులకు పెంచారు. నైపుణ్యం అవసరం లేని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న వయోజన సభ్యులకు ఈ హామీ వర్తిస్తుంది. నిధుల కేటాయింపులోనూ పెద్ద మార్పులు ప్రతిపాదించారు. ఇకపై సాధారణ రాష్ట్రాల్లో కూలీల వేతనాల చెల్లింపులో కేంద్రం–రాష్ట్రం వాటా 60:40గా ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఇది 90:10 నిష్పత్తిలో అమలు కానుంది. నిరుద్యోగ భృతిని మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్రాలకు కొత్త అధికారం ఇచ్చారు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 60 రోజుల పాటు (అవి వరుసగా ఉండాల్సిన అవసరం లేకుండా) పనులను నిలిపివేయవచ్చు. అయితే మిగిలిన కాలంలో కార్మికులకు 125 రోజుల పని కల్పించాల్సి ఉంటుంది.
కూలీలకు వేతనాలు ప్రతి వారం చెల్లించాలని, గరిష్ఠంగా 15 రోజులకు మించి ఆలస్యం జరగకూడదని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. పనుల కేటాయింపులో నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి నిర్మాణాలు, వాతావరణ మార్పులకు తట్టుకునే పనులు అనే నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి సారించనున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు AI ఆధారిత మోసాల గుర్తింపు, GPS ట్రాకింగ్, మొబైల్ పర్యవేక్షణ, రియల్‌టైమ్ డాష్‌బోర్డులు, బలోపేతమైన సోషల్ ఆడిట్‌లు అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు కూడా ఈ బిల్లులో భాగమే. ఈ మార్పులతో గ్రామీణ ఉపాధి వ్యవస్థకు కొత్త ఊపిరి పోసే ప్రయత్నంగా VB–G RAM G బిల్లు నిలవనుంది.
