Donald Trump: అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. దాదాపు ముప్పై ఏళ్ల విరామాన్ని ముగిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump)అణ్వస్త్ర పరీక్ష (Nuclear test)లను తిరిగి ప్రారంభించాలని రక్షణ శాఖకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఇతర అణ్వస్త్ర దేశాలు ముఖ్యంగా రష్యా, చైనా తమ పరీక్షా కార్యక్రమాలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో, అమెరికా కూడా వ్యూహాత్మకంగా వెనుకబడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగనున్న కీలక సమావేశానికి ముందు ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా మాట్లాడుతూ..ఇతర దేశాలు తమ అణ్వాయుధ పరీక్షలను కొనసాగిస్తున్నాయి. మనం కూడా సమానంగా ఉండేందుకు వెంటనే పరీక్షలను పునఃప్రారంభించమని రక్షణ శాఖను ఆదేశించాను. ఈ ప్రక్రియ తక్షణమే ప్రారంభమవుతుంది అని ట్రంప్ తెలిపారు.
అణ్వస్త్ర సామర్థ్య పరంగా ప్రస్తుతం రష్యా అమెరికా తర్వాత రెండో స్థానంలో, చైనా మూడో స్థానంలో ఉన్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో చైనా శక్తివంతమైన అణ్వాయుధ శక్తిగా మారే అవకాశముందని ట్రంప్ అంచనా వేశారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ట్రంప్ నిర్ణయానికి ప్రధాన కారణం రష్యా ఇటీవల చేపట్టిన అణ్వస్త్ర పరీక్షలే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ‘పోసిడాన్’ అనే అణుశక్తితో నడిచే సూపర్ టార్పెడోను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించారు. ఈ టార్పెడో సముద్రతీర ప్రాంతాలను రేడియోధార్మిక సునామీతో పూర్తిగా ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉందని సైనిక నిపుణులు చెబుతున్నారు. అదనంగా, రష్యా అక్టోబర్ 21న ‘బురెవెస్నిక్’ క్రూయిజ్ క్షిపణి పరీక్షను, 22న అణు విన్యాసాలను కూడా నిర్వహించింది.
అమెరికా చివరిసారిగా 1992లో అణ్వస్త్ర పరీక్షను నిర్వహించింది. ఆ తర్వాతి కాలంలో సాంకేతిక సిమ్యులేషన్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించడమే పరిమితమైంది. ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ ప్రత్యక్ష అణు పరీక్షలు జరపడం అమెరికా వ్యూహాత్మక ధోరణిలో పెద్ద మార్పుగా పరిగణిస్తున్నారు. ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశం కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధాల సామర్థ్యాన్ని అంచనా వేయడం, పాత ఆయుధాలు ఇంకా సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవడమే. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం సాంకేతిక పరీక్ష కాదు రష్యా, చైనా లకు అమెరికా సైనిక బలం, వ్యూహాత్మక ఆధిక్యాన్ని మరోసారి గుర్తు చేసే రాజకీయ సందేశం కూడా. 1945లో న్యూ మెక్సికోలో తొలి అణుబాంబును పరీక్షించిన అమెరికా, అదే ఏడాది హిరోషిమా, నాగసాకిలపై అణు దాడులతో రెండో ప్రపంచ యుద్ధానికి ముగింపు పలికింది. ఇప్పుడు 2025లో ట్రంప్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం, ప్రపంచ అణు సమతౌల్యాన్ని మరోసారి కదిలించే అవకాశముందని అంతర్జాతీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
