end
=
Thursday, November 6, 2025
వార్తలుజాతీయంమళ్లీ జమ్మూకశ్మీర్‌ పై పాక్ ఉగ్ర ముప్పు..నిఘా వర్గాల కీలక హెచ్చరిక
- Advertisment -

మళ్లీ జమ్మూకశ్మీర్‌ పై పాక్ ఉగ్ర ముప్పు..నిఘా వర్గాల కీలక హెచ్చరిక

- Advertisment -
- Advertisment -

Kashmir: జమ్మూకశ్మీర్‌లో మళ్లీ పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు పాకిస్థాన్ (Pakistan)ప్రేరేపిత సంస్థలు సిద్ధమవుతున్నాయని తాజా నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ దాడి (Pahalgam attack) తర్వాత భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ముగిసి ఆరు నెలలు గడిచిన వేళ, పాక్ మద్దతుతో నడుస్తున్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జేఈఎం) వంటి సంస్థలు మళ్లీ సమన్వయ దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. నిఘా వర్గాల వివరాల ప్రకారం, సెప్టెంబర్ నుండి ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను చురుకుగా కొనసాగిస్తున్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి చొరబాట్లు, రెక్కీ, ఆయుధాల సరఫరా గణనీయంగా పెరిగింది. పాకిస్థాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ), ఐఎస్ఐ సహకారంతో లష్కరే, జైషే బృందాలు కశ్మీర్‌లోకి చొరబడ్డట్లు సమాచారం. ‘షంషేర్’ అనే లష్కరే నేతృత్వంలోని గ్రూప్ డ్రోన్ల సాయంతో గగనతల సర్వే నిర్వహించి, సరిహద్దుల్లో బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించినట్లు గుర్తించారు. ఇది సమీప భవిష్యత్తులో ఆత్మాహుతి దాడులు లేదా ఆయుధాల అక్రమ రవాణాకు సంకేతంగా అధికారులు భావిస్తున్నారు.

ఇక, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ప్రాంతంలో బోర్డర్ యాక్షన్ టీమ్స్ (బీఏటీఎస్)ను తిరిగి మోహరించినట్లు నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఈ బృందాల్లో మాజీ ఎస్ఎస్‌జీ సైనికులు, శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం. అక్టోబర్ 2025లో పీవోకేలో జరిగిన రహస్య సమావేశాల్లో జమాతే ఇస్లామీ, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకులు, ఐఎస్ఐ అధికారులు పాల్గొన్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సమావేశాల్లో స్లీపర్ సెల్స్‌ను పునరుద్ధరించడం, మాజీ కమాండర్లకు ఆర్థిక సహాయం అందించడం, ‘ఆపరేషన్ సిందూర్’ నష్టాలకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడైంది. తాజాగా ఉగ్రవాదులు కొత్త వ్యూహాన్ని అవలంబిస్తున్నారు. కశ్మీర్ లోయలో స్థానిక మద్దతుదారుల వివరాలను లష్కరే తోయిబా సేకరిస్తూ, మానవ గూఢచార నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. నిధుల సమీకరణ కోసం నార్కో-టెర్రర్, ఆయుధాల స్మగ్లింగ్ మార్గాలను కూడా విస్తరించడంపై దృష్టి సారించారు.

స్థానిక ఎన్నికలు, పర్యాటక రంగం పుంజుకోవడంతో కశ్మీర్‌లో సాధారణ వాతావరణం నెలకొంటున్న తరుణంలో ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ శాంతియుత వాతావరణాన్ని భంగం చేయడానికి ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్ర నెట్‌వర్క్ కృషి చేస్తోందని భద్రతా ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి. ఈ నిఘా సమాచారాన్ని కేంద్ర భద్రతా సంస్థలు ‘కీలక హెచ్చరిక’గా పరిగణిస్తున్నాయి. ఉత్తర కమాండ్ పరిధిలో భారత సైన్యం, నిఘా వర్గాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. పాక్ ఉగ్ర కార్యకలాపాలను అదుపులోకి తేయకపోతే, భారత్ ‘ఆపరేషన్ సిందూర్–2’ను ప్రారంభించే అవకాశం ఉందని సంకేతాలున్నాయి. చలికాలం సమీపిస్తున్న ఈ సమయంలో పాక్ దూకుడు కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తతలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -