America: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ(Washington DC)లోని శ్వేతసౌధానికి సమీపంలో జరిగిన కాల్పుల ఘటన (shooting incident) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump) వలస విధానంపై కీలకమైన, సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు. పేద, అభివృద్ధి చెందని దేశాల (Poor, underdeveloped countries)నుంచి అమెరికాకు వచ్చే వలసలను(Immigration) శాశ్వతంగా నిలిపివేయాలని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ దిశగా అమెరికా పరిపాలనా వ్యవస్థ ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా సాంకేతికంగా ప్రపంచాన్ని నడిపిస్తున్నప్పటికీ, దేశంలోని ఇమిగ్రేషన్ వ్యవస్థ అనేక సమస్యలకు కారణమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వచ్చే వలసలను పూర్తిగా నిలిపివేసి, దేశ భద్రత, సామాజిక శాంతి పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తన ట్రూత్ సోషల్ వేదిక ద్వారా ట్రంప్ ఇలా పేర్కొన్నారు.
అమెరికాకు నిజంగా సేవ చేయని, ఈ దేశాన్ని ప్రేమించని వ్యక్తులను ఇక్కడ నిలవనివ్వం. జో బైడెన్ పాలనలో ఆటోమేటిక్‌గా అనుమతించిన లక్షల అక్రమ వలస ప్రవేశాలను రద్దు చేస్తాం. అమెరికాని సురక్షితంగా ఉంచడం కోసం అవసరమైతే ప్రతి చర్య తీసుకుంటాం. ఇకపై అమెరికా పౌరులు కాని వ్యక్తులకు ఎలాంటి ఫెడరల్ బెనిఫిట్స్, సబ్సిడీలు ఇవ్వం. దేశ ప్రశాంతతకు ముప్పుగా మారిన వారిని నిర్దాక్షిణ్యంగా బహిష్కరిస్తాం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, బుధవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) శ్వేతసౌధం నుండి రెండు బ్లాకుల దూరంలో జరిగిన కాల్పుల్లో నేషనల్ గార్డ్‌కు చెందిన ఒక మహిళా సిబ్బంది మరణించగా, మరోకరు గాయపడ్డారు. నిందితుడిని అఫ్గానిస్థాన్‌కు చెందిన రెహ్మనుల్లా లకన్‌వాల్‌గా అధికారులు గుర్తించారు. అతడు గతంలో సీఐఏ మద్దతుతో పనిచేసిన అఫ్గాన్ ప్రత్యేక దళంలో సభ్యుడిగా ఉన్న తర్వాత అమెరికాకు వలస వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్రంప్ వలసలపై కఠిన చర్యలు తప్పనిసరి అయ్యాయని తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
అంతేకాదు, అఫ్గానిస్థాన్‌తో పాటు మరో 18 దేశాలకు చెందిన గ్రీన్‌కార్డ్ హోల్డర్ల వివరాలను పునఃసమీక్షించేందుకు కూడా అమెరికా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది భద్రతా ప్రమాణాలను పునర్మూల్యాంకనం చేయడానికి తీసుకున్న చర్యగా చెబుతున్నారు. పేద, అభివృద్ధి చెందని దేశాలను గతంలో థర్డ్ వరల్డ్ కంట్రీస్గా పిలుస్తుండేవారు. ప్రస్తుతం వీటిని తక్కువ ఆదాయ దేశాలుగా పేర్కొంటున్నారు. ఈ జాబితాలో దక్షిణ సూడాన్, సోమాలియా, బురుండి, నైగర్, బుర్కినా ఫాసో, అఫ్గానిస్థాన్, మడగాస్కర్, ఇథియోపియా, లైబీరియా, పాకిస్థాన్, సిరియా, ఉగాండా వంటి దేశాలు ఉన్నాయి. శ్వేతసౌధం సమీప కాల్పులతో మొదలైన ఈ సంఘటన అమెరికా వలస విధానంలో భారీ మార్పులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం దేశీయ రాజకీయాల్లో మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.
