Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) సమీపిస్తున్న వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జన సురాజ్ పార్టీ(Jana Suraj Party) అధినేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) కీలకంగా భావించదగ్గ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆయన స్వయంగా ఎన్నికల్లో పోటీ చేయరని స్పష్టం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన, “పార్టీ నిర్ణయం మేరకు నేను పోటీకి దూరంగా ఉన్నాను. పార్టీ కోసం శ్రమిస్తాను కానీ వ్యక్తిగతంగా బరిలోకి దిగను” అని తెలిపారు. రాఘోపుర్ నియోజకవర్గంలో తేజస్వీ యాదవ్ పై పోటీ చేయడానికి ఇప్పటికే మరో అభ్యర్థిని ప్రకటించినట్టు చెప్పారు. నేను పోటీలో ఉంటే పార్టీ కార్యక్రమాలపై నా దృష్టి మళ్లే ప్రమాదం ఉంది. ఇది గమనించి, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం అని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో జన సురాజ్ పార్టీ దాదాపు 150 స్థానాల్లో విజయం సాధిస్తుందని పీకే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలతో తమ పార్టీ బిహార్‌లోనే కాక దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హంగ్ పరిస్తితి ఏర్పడినట్టయితే ఏ కూటమికి మద్దతిస్తారు అనే ప్రశ్నకు స్పందిస్తూ అది అసాధ్యం. మేము మద్దతివ్వాల్సిన అవసరం రాదు. మేమే అధికారం చేజిక్కించుకుంటాం అని ధీమాగా చెప్పారు. అలాగే, బిహార్ సీఎం నీతీశ్ కుమార్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఈసారి జేడీయూకు కనీసం 25 స్థానాలు కూడా రావు. ఎన్డీయే ఓటమి తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది. నీతీశ్ కుమార్ ఇక మళ్లీ సీఎంగా రావడం అసాధ్యం. ఇదే సమయంలో ఇండియా కూటమి పరిస్థితీ కూడా తేలికగా లేదు. కాంగ్రెస్ మరియు ఆర్జేడీల మధ్య విభేదాలు ఇంకా పరిష్కారం కాలేదు అని ఆరోపించారు.
కాగా, తమ పార్టీ అధికారంలోకి వస్తే, బిహార్‌లో జరుగుతున్న మాఫియా, అవినీతిపై ఉక్కుపాదం మోపుతామని. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే 100 మంది అవినీతి రాజకీయ నేతలు, అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రజలకు భరోసా ఇస్తాం అని హామీ ఇచ్చారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు దశలుగా జరగనుంది. నవంబరు 6 మరియు 11 తేదీల్లో ఓటింగ్ జరగనుండగా, ఫలితాలు నవంబరు 14న వెలువడనున్నాయి. జన సురాజ్ పార్టీ ఈ ఎన్నికలతో కొత్త రాజకీయ శక్తిగా అవతరించబోతోందా? అనేది చూడాల్సిన విషయమే.