- సీఎస్‌ను కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వీ లచ్చిరెడ్డి (lachhireddy)
రాష్ట్రంలోని ఉద్యోగులకు (employees), ఉపాధ్యాయులకు (teachers), పెన్షనర్లకు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ వి లచ్చిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మంగళవారం లచ్చిరెడ్డి నేతృత్వంలో జేఏసీ ప్రతినిధులు కలిశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం(EHS) అమలు గురించి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి, ఇతర జేఏసీ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (CS) పలు విషయాలను వివరించారు. ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కోరారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో అన్ని రకాల జబ్బులకు అపరిమిత, నగదు రహిత వైద్య సేవలను అందేలా చూడాలన్నారు. ఐపీ, ఓపీ చికిత్సలకు ప్రభుత్వం నుంచే కాకుండా ఉద్యోగి కాంట్రిబూషన్ కూడా ప్రతి నెల సమానంగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి ఆధారిత కుటుంబ సభ్యులకు ఎంపానెల్ చేసిన ఆసుపత్రుల్లో (Hospitals) నగదు రహిత వైద్యం అందించేందుకు ఉద్యోగుల వేతన స్థాయిని బట్టి కాంట్రీబూషన్గా ఈహెచ్ఎస్కు చెల్లించేందుకు పథకం రూపొందించినట్టు గుర్తు చేశారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వలన ఇది అమలు చేయకపోవడంతో వైద్య ఖర్చుల రీయింబర్స్మెంట్ విధానమే కొనసాగుతోందని చెప్పారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు ఇన్-పేషెంట్- అవుట్-పేషెంట్ నగదు రహిత చికిత్స కోసం మార్గదర్శకాలు జారీ చేసినా, అమలులో అనేక అవాంతరాలు ఏర్పడుతున్నాయన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు హెల్త్ కార్డులను (health cards) అంగీకరించకపోవడం, ఆసుపత్రి బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర ఆలస్యం ఉండటం వల్ల ఈహెచ్ఎస్ లక్ష్యం నెరవేరడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు పీఆర్సీలతో వేతనాలు గణనీయంగా పెరిగాయన్నారు. ఆరోగ్యంపై అవగాహన పెరగడం వలన ఉద్యోగులు ప్రభుత్వంతో పాటు తమ వంతు వాటాను కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లబ్ధిదారుల సంఖ్య, వయస్సు, ప్రత్యేక సేవలను బట్టి (ఐచ్చికంగా) కాంట్రీబూషన్ను నిర్ణయించడం సమంజసంగా ఉంటుదన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న ప్రస్తుత రీయింబర్స్మెంట్ విధానం ఉద్యోగులకు అనుకూలంగా లేదన్నారు.
అత్యవసర చికిత్సకు గుర్తింపు పొందిన ఆసుపత్రికే వెళ్లాల్సి ఉందన్నారు. అడ్వాన్స్ కోసం అధిక వడ్డీతో అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. రోగి ఉద్యోగి అయితే కుటుంబ సభ్యులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ సీలింగ్ పరిమితుల వల్ల పూర్తి ఖర్చు రీయింబర్స్ కాకపోవడంతో భారంగా మారుతుందన్నారు.
గుండె, క్యాన్సర్, న్యూరో, కిడ్నీ మార్పిడి వంటి పెద్ద చికిత్సలకు గరిష్ట పరిమితి రూ.2 లక్షలు మాత్రమే ఉందన్నారు. దీనికి సంబంధించిన సడలింపుల ప్రక్రియకు మరింత ఆలస్యం అవుతుందన్నారు.
రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సుమారు 10 లక్షల మంది ఉన్నారన్నారు. వీరందరూ నెలవారీగా వారిగా కాంట్రీబూషన్ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్‌గా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది జీతపు స్లిప్‌లో డిడక్షన్ గా చూపించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పర్యవేక్షణలో ఈహెచ్ఎస్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతిపాదనపై సీఎస్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత విభాగాల అధికారులతో సంప్రదించి తుది నివేదికను ఇచ్చేలా చర్యలు చేపట్టనున్నట్టుగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నాయకులు కె.రామకృష్ణ, రమేష్ పాక, పూల్‌సింగ్‌చౌహాన్, గరికె ఉపేందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
