Berlin : జర్మనీ పర్యటన(Germany tour)లో భాగంగా బెర్లిన్(Berlin)లో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt)పై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. విదేశీ గడ్డపై నిలబడి భారత్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మాట్లాడడం రాహుల్‌కు అలవాటైపోయిందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. రాహుల్ విదేశీ పర్యటనల్లో భారత్‌ను అవమానించే వ్యాఖ్యలు చేయడమే తన పనిగా పెట్టుకున్నారని పూనావాలా విమర్శించారు. భారత్‌ను విమర్శిస్తూ, పరోక్షంగా చైనా వంటి దేశాలకు మద్దతు పలకడం కాంగ్రెస్ నేతల పాత అలవాటేనని ఆరోపించారు. విదేశాల్లో భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి, దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. దేశ అంతర్గత అంశాలను విదేశాల్లో ప్రస్తావిస్తూ భారత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు
ఇదే అంశంపై మరో బీజేపీ నేత, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా దేశ వ్యతిరేక నాయకుడిగా చూడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఓ జాతీయ పార్టీకి అగ్రనేతగా కొనసాగుతున్నప్పటికీ రాహుల్ ప్రవర్తన చిన్నపిల్లాడిలా ఉందని మండిపడ్డారు. విదేశాల్లో భారత్‌పై విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లాభాలు పొందాలనుకోవడం సరికాదని ఆమె అన్నారు. మరోవైపు, బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా ఆలోచిస్తోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం పావుల్లా ఉపయోగించుకుంటూ ఓట్ల చోరీకి పాల్పడుతోందని అన్నారు.
ఎన్డీఏ నేతలు ఎన్ని అక్రమాలు చేసినా దర్యాప్తు సంస్థలు పట్టించుకోకుండా మౌనంగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై మాత్రం కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని తాను ఆధారాలు చూపించినప్పటికీ ఎన్నికల కమిషన్ స్పందించడంలేదని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కలిసి ఓ బలమైన కవచాన్ని నిర్మిస్తున్నాయని ఆయన తెలిపారు. రాహుల్ వ్యాఖ్యలు, భాజపా ప్రతిస్పందనలతో ఈ అంశం దేశ రాజకీయాల్లో మరోసారి వేడెక్కిన చర్చకు దారి తీసింది.
