Visakhapatnam : విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (30th CII Partnership Summit)రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల (Investments) పరంపర కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి దిశగా జరుగుతున్న ఈ ప్రధాన సమావేశం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ పెట్టుబడిదారులకు స్పష్టమైన సందేశం ఇస్తున్నారు. తాజా కార్యక్రమంలో దేశ ప్రసిద్ధ వస్త్ర తయారీ దిగ్గజం రేమాండ్ గ్రూప్ ఆధ్వర్యంలో అమలు కానున్న మూడు పెద్ద ప్రాజెక్టులను సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు.
రూ. 1,201 కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ మూడు యూనిట్లు అనంతపురం జిల్లాలో నెలకొననున్నాయి. పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఈ ప్రాజెక్టులు 6,500 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి కేంద్రంగా దక్షిణాంధ్రను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరడంలో ఇవి కీలక మైలురాళ్లుగా భావిస్తున్నారు. వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, కార్పొరేట్ డెవలప్‌మెంట్ హెడ్ జతిన్ ఖన్నా పాల్గొన్నారు. రేమాండ్ గ్రూప్ ప్రతిపాదన ప్రకారం.
. రాప్తాడు ప్రాంతంలో రూ. 497 కోట్లు వెచ్చించి సిల్వర్ స్పార్క్ అప్పారెల్ పార్క్,
. గుడిపల్లిలో రూ. 441 కోట్ల వ్యయంతో ఆటో కాంపోనెంట్ తయారీ యూనిట్,
. టెకులోదు వద్ద రూ. 262 కోట్ల పెట్టుబడితో ఏరోస్పేస్ పరికరాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కానున్నాయి.
ఈ మూడు పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ మరింత చురుకుదనం సంతరించుకునే అవకాశం ఉందని రేమాండ్ ప్రతినిధులు తెలిపారు. సమ్మిట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పలు దేశీయ–విదేశీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఎల్జీ కెమ్, అట్మాస్ఫియర్ కోర్, ఇఫ్కో, కార్డెలియా క్రూయిజెస్, సుమిటోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ వంటి ప్రముఖ సంస్థల ఉద్ధేశ్యాధికారులు సీఎం తో చర్చలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా న్యూజిలాండ్, జపాన్, మెక్సికో దేశాల ప్రతినిధి బృందాలు కూడా పెట్టుబడుల అవకాశాలపై సమగ్ర చర్చలకు హాజరుకానున్నాయి. సమ్మిట్‌లో సీఎం సమక్షంలో శ్రీసిటీలో అమలు చేస్తున్న ప్రాజెక్టులతో పాటు మరికొన్ని రంగాల సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ భాగస్వామ్య సదస్సు కీలక పాత్ర పోషించనుంది.
