Repo Rate: భారత ఆర్థిక వ్యవస్థ(Indian economy)ను మరింత చైతన్యవంతం చేస్తూ, భారత రిజర్వ్ బ్యాంక్(Reserve Bank of India) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య పరపతి కమిటీ (MPC) సమావేశంలో 25 బేసిస్ పాయింట్ల (0.25%) మేరకు రెపో రేటును తగ్గించాలని ఏకగ్రీవంగా నిర్ణయించగా, దీనితో రెపో రేటు 5.5 శాతం నుంచి 5.25 శాతానికి పడిపోయింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా (Governor Sanjay Malhotra)అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశ ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ పెంపు, వృద్ధి ప్రోత్సాహం లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యతను పెంచేందుకు ఆర్‌బీఐ మరిన్ని చర్యలు చేపడుతుందని వెల్లడించారు.
ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ల (OMO) ద్వారా లక్ష కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అదనంగా, విదేశీ మారక నిల్వలను బలోపేతం చేయడానికి 5 బిలియన్ డాలర్ల విలువైన డాలర్–రూపాయి స్వాప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశ ఆర్థిక సూచీలు ప్రస్తుతం అనుకూల దిశగా ఉన్నాయని గవర్నర్ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి 8.2 శాతానికి చేరడం, ద్రవ్యోల్బణం 1.7 శాతానికి తగ్గడం ఆర్థిక వ్యవస్థకు “సువర్ణ కాలం”గా అభివర్ణించారు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండటం వలన వడ్డీ రేట్ల తగ్గింపుకు అవకాశం లభించిందని అన్నారు. ఈ నేపధ్యంలో దేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.8 శాతం నుంచి 7.3 శాతానికి సవరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ద్రవ్య విధానంలో తటస్థ వైఖరిని కొనసాగిస్తామని, ఆగస్టు, అక్టోబర్ సమీక్షల్లో ద్రవ్యోల్బణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదని మల్హోత్రా గుర్తు చేశారు.
విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాల్లర్ల రికార్డు స్థాయిని చేరుకోవడం దేశ ఆర్థిక స్థిరత్వానికి సంకేతమని తెలిపారు. ఇవి 11 నెలల దిగుమతులను నిర్వహించడానికి సరిపోతున్నాయని కూడా పేర్కొన్నారు. అయితే, అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగానే మిగిలి ఉన్నాయని హెచ్చరించారు. రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రయోజనం వినియోగదారులకు ఎంత త్వరగా చేరుతుందనేది వాణిజ్య బ్యాంకుల స్పందనపై ఆధారపడి ఉంటుంది. రుణగ్రాహకులకు ఇది ఉపశమనం కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, రేట్ల కోత ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం మీద, ఆర్‌బీఐ తాజా నిర్ణయాలు వృద్ధి మార్గంలో భారత ఆర్థిక వ్యవస్థకు మరొక పురోగతి సంకేతంగా నిలుస్తున్నాయి.
