Russia: అంతర్జాతీయ చట్టాల(International laws)ను లెక్కచేయకుండా అతి విశ్వాసంతో వ్యవహరిస్తోందంటూ అమెరికా(America)పై రష్యా(Russia) తీవ్రంగా మండిపడింది. అమెరికా తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే ప్రతీకార చర్యలకు తప్పదని, అవసరమైతే అమెరికా నౌకలను సముద్రంలోనే ముంచివేస్తామని ఘాటైన హెచ్చరికలు చేసింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో రష్యా జెండాతో ప్రయాణిస్తున్న వెనెజువెలాకు చెందిన చమురు నౌకను అమెరికా దళాలు స్వాధీనం చేసుకోవడమే ఈ ఉద్రిక్తతకు కారణంగా మారింది. ఈ ఘటన అనంతరం ఉత్తర అట్లాంటిక్ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. సముద్ర మార్గాల్లో భద్రత, వాణిజ్య స్వేచ్ఛ అంశాలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా చర్యను రష్యా తీవ్రంగా ఖండిస్తూ, ఇది అంతర్జాతీయ చట్టాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. సముద్రాల్లో నౌకల స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని అడ్డుకోవడం ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతుందని హెచ్చరించింది. ఈ పరిణామంపై రష్యా చట్టసభ్యుడు అలెక్సీ జురావ్లెవ్ స్పందించారు. అమెరికా తన తీరు మార్చుకోకపోతే ప్రతీకార దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే సైనిక ప్రతిస్పందనకు రష్యా వెనుకాడదని హెచ్చరించారు. అవసరమైతే టార్పిడో దాడులు చేపట్టడం, అమెరికా కోస్ట్ గార్డ్ నౌకలపై దాడులు చేయడం వంటి చర్యలకు కూడా సిద్ధమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమేనని, పరిస్థితులు మరింత తీవ్రతరమైతే చర్యలు తప్పవని అన్నారు. అమెరికా తరచూ ఇతర దేశాల నౌకలను తన చట్టాల పేరుతో అడ్డుకోవడం సరైంది కాదని రష్యా ఆరోపిస్తోంది.
ఇలా చేస్తూ అమెరికా ప్రపంచానికి తానే పోలీస్ అన్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించింది. ఈ తరహా చర్యలు అంతర్జాతీయ సముద్ర చట్టాల్ని బలహీనపరుస్తాయని, భవిష్యత్తులో మరింత ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించకపోతే, సముద్రాల్లో ఘర్షణలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ శాంతి, వాణిజ్య భద్రత దృష్ట్యా ఇరు దేశాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంతర్జాతీయ వర్గాలు సూచిస్తున్నాయి.
