Putin Arrives in India: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) రెండు రోజుల అధికారిక పర్యటనకు గురువారం భారత్(India) చేరుకోనున్నారు. 2021 తర్వాత ఆయన భారత్‌కు రానున్న ఇది తొలి పర్యటన కావడం విశేషం. అధికారిక షెడ్యూల్ ప్రకారం పుతిన్ గురువారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో అడుగుపెడతారు. చేరుకున్న వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) నిర్వహించే ప్రైవేట్ డిన్నర్‌కు ఆయన హాజరవుతారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించే ఆయన, అనంతరం రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీ సమాధికి నివాళులు అర్పిస్తారు. తర్వాత హైదరాబాద్ హౌస్‌లో మోదీ, పుతిన్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుంది. ఇరు దేశాల మధ్య కీలక అంశాలపై చర్చ అనంతరం ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు.
తదుపరి, ప్రధాని మోదీ ఇచ్చే వర్కింగ్ లంచ్‌లో పుతిన్ పాల్గొంటారు. తర్వాత ఢిల్లీలోని భారత్ మండపంలో ఫిక్కీ నిర్వహించే ప్రత్యేక సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందు కార్యక్రమంలో పుతిన్ పాల్గొనడంతో ఆయన భారత పర్యటన ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పుతిన్‌తో పాటు భారత్ చేరనున్న రష్యా రక్షణ మంత్రి అండ్రే బెలొసోవ్ గురువారం మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో అదనంగా ఐదు యూనిట్ల ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఎస్‌యు–30 ఫైటర్ జెట్ల ఆధునీకరణ, ఇతర కీలక సైనిక సామగ్రి సరఫరా వంటి అంశాలు ప్రధాన చర్చాంశాలుగా నిలవనున్నాయి.
అదేవిధంగా పౌర అణు ఇంధన సహకారంపై కొత్త అవగాహన ఒప్పందం కుదిరే అవకాశమూ ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రష్యా క్యాబినెట్ ఇప్పటికే అనుమతి తెలిపింది. రోసాటోమ్ న్యూక్లియర్ కార్పొరేషన్ తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్ర నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై రష్యా తరఫున సంతకం చేయడానికి ఆ సంస్థకు అధికారాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. భద్రతా చర్యల పరంగా, పుతిన్ పర్యటనకు ముందుగా రష్యా అధ్యక్ష భద్రతా దళాలకు చెందిన సుమారు 50 మంది కమాండోలు ఢిల్లీలోకి చేరారు. వీరు ఢిల్లీ పోలీసులు, ఎన్ఎస్జీతో కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. అదేవిధంగా పుతిన్ ఉపయోగించే ప్రత్యేక లగ్జరీ లిమోజిన్ ‘ఆరస్ సెనాట్’ను కూడా రష్యా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రవాణా చేస్తున్నారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య రక్షణ, అణుశక్తి, వ్యాపార రంగాల్లో కొత్త ఒప్పందాలు, బలోపేతమైన సహకారానికి మార్గం సుగమం కానున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.
