Samantha Wedding : అగ్ర నటి సమంత(Samantha) వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు రాజ్ నిడిమోరు(Director Raj Nidimoru)తో ఆమె డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి ఆలయంలో చాలా సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి చిత్రాలు సోషల్ మీడియాలోకి రాగానే నిమిషాల్లోనే వైరల్ అవుతూ, అభిమానులు, సినీ ప్రముఖులు కొత్త జంటపై అభినందనలు కురిపిస్తున్నారు. పెళ్లి జరిగిన మరుసటి రోజైన డిసెంబర్ 2న సమంతకు అత్తింట్లో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా రాజ్ సోదరి శీతల్ నిడిమోరు (Sheetal Nidimoru)సోషల్ మీడియాలో ఓ హృదయపూర్వక నోట్ పంచుకుంటూ, సమంతను కుటుంబంలోకి స్వాగతిస్తూ ఎమోషనల్‌గా స్పందించారు. ఆమె రాసిన ఆ భావోద్వేగ సందేశం ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
“ఈ రోజు నాకు మాటలు రావట్లేదు. గొప్ప భక్తితో శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న భక్తుడికి కలిగే ఆనందం ఎంత ఉంటుందో, మా ఇంట్లో సమంత అడుగుపెట్టిన తర్వాత నేను అలా అనుభవిస్తున్నాను. ఆనందబాష్పాలతో మా హృదయాలు నిండిపోయాయి. సమంత, రాజ్ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్న తీరు మా కుటుంబానికి గర్వకారణం. గౌరవం, నిజాయితీ ఆధారంగా ఇద్దరి మనసులు ఒకటయ్యేప్పుడు వారి ప్రయాణం ఎల్లప్పుడూ శాంతితో నిండిపోతుంది. మేము వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటాం.”అలాగే ఈశా ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆమె, తమ కుటుంబానికి ఈ వేడుక ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దీనికి సమంత “లవ్ యూ” అంటూ స్పందించడం నెటిజన్లను మరింత ఆకట్టుకుంది.
ఇక, ఈ పెళ్లిలో సమంత ధరించిన రింగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మొఘల్ యుగంలో ఉపయోగించబడిన ప్రత్యేక డిజైన్ ఆధారంగా రూపొందించిన ఆ రింగ్‌కు సాంప్రదాయ, సౌందర్యాల సమ్మిళిత రూపం ఉంది. ఈ అరుదైన శైలి కారణంగా రింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకలో సమంత ఎర్రచీరలో అద్భుతంగా మెరిసిపోగా, రాజ్ నిడిమోరు క్రీమ్, గోల్డ్ కుర్తాలో రాచరిక లుక్‌లో కనిపించారు. మినిమల్ అతిథులతో జరిగిన ఈ ఆధ్యాత్మిక వివాహం సరళత, పౌరోహిత్యం, సంప్రదాయం అన్నింటి సమ్మేళనంగా అనిపించిందని హాజరైన వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కొత్త జంట ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుండగా, అభిమానులు సమంత,రాజ్‌కు శుభాకాంక్షలు, ఆశీస్సులతో నిండిన కామెంట్లు పెడుతున్నారు.
