Maa Inti Bangaram: కొంతకాలంగా వెండితెరపై కనిపించకుండా విరామం తీసుకున్న స్టార్ హీరోయిన్ సమంత(star heroine Samantha) ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ రూపంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఆమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’(Maa Inti Bangaram) టీజర్(Teaser)ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేయగా, విడుదలైన క్షణాల్లోనే ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసిన సమంతకు భిన్నంగా, ఈ టీజర్‌లో ఆమె కనిపించిన రగ్డ్, సీరియస్ లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చీరకట్టులో బస్సులోనే శత్రువులతో సమంత చేసే యాక్షన్ ఫైట్ సన్నివేశాలు ఈ టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. సాధారణంగా సాఫ్ట్ రోల్స్‌కే పరిమితమయ్యే కథానాయిక అనే ఇమేజ్‌ను పూర్తిగా చెరిపేసేలా ఈ సన్నివేశాలు రూపొందించారు.
దీంతో ఈ సినిమా సమంత కెరీర్‌లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలవబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీజర్ విడుదలైన వెంటనే నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు. ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ వినగానే ఒక భావోద్వేగ కుటుంబ కథ అనిపించినా, టీజర్ చూస్తే ఇది పూర్తిస్థాయి యాక్షన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. కథలో భావోద్వేగాలతో పాటు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు కూడా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సమంత కెరీర్‌లో ఇది ఒక సాహసోపేతమైన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి దర్శకురాలు నందిని రెడ్డి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఓ బేబీ’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రావడంతో సినీ వర్గాల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అంతేకాదు, ఈ సినిమాకు సమంత సహ నిర్మాతగా కూడా వ్యవహరించడం మరో విశేషం.
త్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి సమంత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీలక పాత్రల్లో ‘కాంతారా’ ఫేమ్ గుల్షన్ దేవయ్య, కన్నడ నటుడు దిగంత్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందిస్తున్న సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలకు అదనపు బలాన్ని ఇవ్వనుంది. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి వెబ్ సిరీస్‌లలో యాక్షన్ పాత్రలతో మెప్పించిన సమంత, ఈ సినిమాలో డూప్ లేకుండా స్వయంగా స్టంట్స్ చేసినట్లు సమాచారం. సుదీర్ఘ విరామం తర్వాత కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాతో సమంత రీఎంట్రీ ఇస్తుండటంతో, అభిమానులు ‘మా ఇంటి బంగారం’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
