మూడు నెలలు గడువు..
నెల రోజుల్లో వార్డుల విభజన చేయాలి: హైకోర్టు
రాష్ట్రవ్యాప్తంగా (Whole Telangana)మూడు నెలల్లో (Three Months Time) పంచాయతీ ఎన్నికలు (Local body Elections) నిర్వహించాలని (Must to be held), 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని బుధవారం హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు 2024 జనవరి 30వ తేదీతో ముగిసినా ఎన్నికల నిర్వహణలో జాప్యం ఎందుకని ప్రశ్నించింది. లోకల్ ఎన్నికల నిర్వహణపై పలువురు
మాజీ సర్పంచ్లు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి విచారణ చేపట్టారు. తొలుత పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసినా.. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తున్నదన్నారు. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించగా, వారు పట్టించుకోకపోవడంతో పాలన కాస్త కుంటుపడిందన్నారు.
ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. గతం పాలకవర్గాలు సర్కార్ డబ్బు ఇస్తుందనే నమ్మకంతో సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారని, కానీ.. ప్రభుత్వం వారికి నిధులు విడుదల చేయలేదన్నారు. ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, లేదంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలని వాదించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ తన వాదన వినిపిస్తూ..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని కోర్టుకు తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ..
రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తికాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక.. ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున..
ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ..రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి మూడు నెలల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు.