UIDAI: ఇది ఆధార్ కార్డు వినియోగదారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త. ఆధార్ కార్డు వివరాలలో మార్పులు చేసుకోవాలనుకునే వ్యక్తులకు ఇది తెలిసి ఉండాల్సిన అప్డేట్. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) తాజాగా ఆధార్ డేటా అప్‌డేట్లకు సంబంధించిన రుసుములను పెంచింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఛార్జీలను సవరించడం గమనార్హం.
కొత్త రుసుములు ఇలా ఉంటాయి..
UIDAI తాజా ప్రకటన ప్రకారం, ఆధార్ కార్డులో డెమోగ్రాఫిక్ వివరాలు అంటే పేరు, చిరునామా, లింగం, పుట్టిన తేదీ వంటి వివరాలను మార్చుకోవాలంటే ఇకపై రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ సేవలకు రూ. 50 మాత్రమే చార్జీ ఉండేది. ఇదే విధంగా, బయోమెట్రిక్ వివరాలు అంటే వేలిముద్రలు, కంటిపాప స్కాన్‌లు, ఫోటోలు తదితర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలంటే, ఇప్పటివరకు ఉన్న రూ. 100 ఛార్జీ బదులు ఇకపై రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. ఈ సవరించిన రుసుములు 2028, సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉండనున్నట్లు UIDAI స్పష్టం చేసింది. ఆ తర్వాత వీటిపై మరోసారి సమీక్ష జరపనున్నారు.
ఎవరికెవరికీ మినహాయింపు?
UIDAI ప్రకారం, కొన్ని ముఖ్యమైన సేవలకు రుసుముల పెంపు వర్తించదు. ముఖ్యంగా కొత్తగా పుట్టిన శిశువులకు ఆధార్ నమోదు ఉచితంగానే ఉంటుంది.
పిల్లలు 5 సంవత్సరాల వయస్సు వద్ద చేయాల్సిన బయోమెట్రిక్ అప్‌డేట్ (mandatory biometric update) కు ఎటువంటి ఛార్జీ ఉండదు. అంతేగాక, 7 సంవత్సరాల లోపు మరియు 15-17 సంవత్సరాల మధ్య వయస్సులో చేయాల్సిన అప్‌డేట్లకూ రుసుము తీసుకోరని అధికారులు స్పష్టం చేశారు.
ఇంటి వద్ద ఆధార్ సేవలు (డోర్‌స్టెప్ సర్వీసెస్)
ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం UIDAI డోర్‌స్టెప్ సర్వీసును కూడా అందిస్తోంది. అంటే, అధికారులు మీ ఇంటికే వచ్చి ఆధార్ అప్‌డేట్ సేవలు అందిస్తారు. ఈ సేవల కోసం జీఎస్‌టీతో కలిపి రూ. 700 చార్జీగా వసూలు చేస్తారు. ఒకే ఇంట్లో అనేక మందికి ఈ సేవలు అవసరమైతే:
మొదటి వ్యక్తికి రూ. 700 ప్రతి అదనపు వ్యక్తికి రూ. 350 చొప్పున చార్జీలు విధిస్తారు.
వినియోగదారుల దృష్టికి
ఈ మార్పులు తక్షణమే అమల్లోకి వచ్చాయి. ఆధార్ కార్డు అప్‌డేట్ అవసరమున్నవారు, తాజా రుసుముల ప్రకారం ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ద్వారా ఆధార్ అప్‌డేట్లు చేయవచ్చు, కానీ బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది లేదా డోర్‌స్టెప్ సర్వీస్ బుక్ చేసుకోవాలి. ఈ మార్పులు ఆధార్ సేవల వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికే ఉద్దేశించాయని UIDAI తెలిపింది. అయితే, వినియోగదారులు అవసరానికి మించి మార్పులు చేయడం నివారించాలి, ఎందుకంటే ప్రతి మార్పుకూ ఖర్చు పెరిగిన నేపథ్యంలో జాగ్రత్త అవసరం.
