Mithun Reddy: ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం చేస్తూ రాష్ట్ర ఎస్ఐటీ (Special Investigation Team) అధికారులు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి (Mithun Reddy)నివాసాల్లో మంగళవారం ఉదయం సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలు హైదరాబాద్(Hyderabad) మరియు బెంగళూరు(Bangalore)లోని ఆయన ఇళ్లపై ప్రత్యేక దళం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ పరిధిలో ఉన్న ప్రశాసన్‌నగర్ మరియు యూసుఫ్‌గూడ ప్రాంతంలోని గాయత్రీ హిల్స్‌లో ఉన్న మిథున్‌రెడ్డి నివాసాల్లో అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఆయనతో సంబంధాలున్న మరోకయితర ప్రాంతాల్లోనూ అధికారులు సోదాలు చేపట్టినట్లు సమాచారం.
ఈ దాడులు 2021–2024 మధ్య కాలంలో వైఎస్‌ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం వ్యవహారాల్లో చోటుచేసుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో చోటుచేసుకున్నాయి. సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మద్యం శాఖ ఉన్నతాధికారుల విచారణను మొదలుపెట్టగా, తాజాగా రాజకీయ నేతలపై దృష్టిసారించారు. మద్యం కొనుగోలు, సరఫరా, ధరల నియంత్రణలో భారీ కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. మిథున్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణల ప్రకారం, ప్రభుత్వ అనుకూలతను ఉపయోగించి మద్యం సరఫరా కాంట్రాక్టుల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సోదాల్లో ఎలాంటి పత్రాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారో అన్నది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉంటే, మిథున్‌రెడ్డి తరఫున ఎవరూ ఈ విషయంపై స్పందించలేదు. పార్టీ వర్గాలు కూడా ఈ ఘటనపై మౌనం పాటిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మధ్య ఈ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్సీపీకి చెందిన కీలక నేతలపై దర్యాప్తు ముమ్మరమవుతుండటంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక మలుపు తీసుకొచ్చే అవకాశం ఉంది.