end
=
Sunday, December 21, 2025
వార్తలురాష్ట్రీయంతల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే..కఠిన చర్యలు తప్పవు : సీపీ సజ్జనార్ హెచ్చరిక
- Advertisment -

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే..కఠిన చర్యలు తప్పవు : సీపీ సజ్జనార్ హెచ్చరిక

- Advertisment -
- Advertisment -

VC Sajjanar: కన్న పిల్లల చేతిలోనే నిర్లక్ష్యానికి, అవమానానికి గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల(Elderly parents) సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ (Hyderabad City Police Commissioner VC Sajjanar) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అమానుష ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ, బాధ్యత తప్పించుకునే పిల్లలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయమై మంగళవారం ఆయన ఒక వీడియో సందేశం ద్వారా సమాజానికి గట్టి సందేశం పంపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మాత్రమే కాకుండా, గతంలో సైబరాబాద్, టీజీఎస్ఆర్టీసీతో పాటు వివిధ జిల్లాల్లో పని చేసిన అనుభవంలో తాను ఎన్నో బాధాకర సంఘటనలను చూశానని సజ్జనార్ తెలిపారు.

రోజూ తనను కలిసే వందలాది పిటిషనర్లలో, పిల్లలు పట్టించుకోకపోవడంతో ఒంటరితనానికి, ఆర్థిక ఇబ్బందులకు, మానసిక వేదనకు గురవుతున్న వృద్ధులు కనిపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వృద్ధుల పరిస్థితిని చూసిన ప్రతిసారి తన మనసు కలత చెందుతుందని చెప్పారు. తల్లిదండ్రులను చూసుకోవడం అనేది పిల్లలు చేసే ఉపకారమో, వారిపై మోపిన భారమో కాదని సజ్జనార్ స్పష్టం చేశారు. అది ప్రతి బిడ్డకు జన్మతో వచ్చే బాధ్యత, హక్కు అని అన్నారు. దీనిపై ఎలాంటి సాకులు చెప్పడానికి, వాదనలు చేయడానికి తావు లేదని, తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించకపోవడం మానవత్వానికి విరుద్ధమని అన్నారు. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తారో, అదే రేపు మీ పిల్లలు మీతో ప్రవర్తించే పాఠంగా మారుతుంది.

ఈ తరం చేసే పనులే తరువాతి తరానికి దిశానిర్దేశం చేస్తాయి అంటూ ఆయన హెచ్చరికతో కూడిన హితవు పలికారు. వృద్ధ తల్లిదండ్రులను వేధించడం, ఇంటి నుంచి బయటకు నెట్టేయడం, అవసరాలను పట్టించుకోకపోవడం వంటి చర్యలు నేరమేనని, అలాంటి వారిని కఠినంగా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా వృద్ధులకు సజ్జనార్ భరోసా ఇచ్చారు. మీరు ఒంటరివారు కారు. మీకు ఏ సమస్య వచ్చినా భయపడకుండా నేరుగా నన్ను సంప్రదించండి. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సును కాపాడటం హైదరాబాద్ పోలీసుల బాధ్యత అని ఆయన హామీ ఇచ్చారు. సమాజం మొత్తం వృద్ధుల పట్ల మరింత సున్నితంగా, బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -