Gold Prices: ఈరోజు ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో (MCX)విలువైన లోహాల విలువల్లో మిశ్రమ ప్రభావం కనిపించింది. పసిడి ధరలు (Gold Prices)స్వల్ప నష్టాలతో ప్రారంభం కాగా, వెండి (Silver Prices)మాత్రం లాభాల దిశగా కదిలింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ బలపడటం, ఫెడరల్ రిజర్వ్ తాజా సూచనల ప్రభావం దేశీయ ధరలపై స్పష్టంగా కనిపించింది. ఉదయం 9:45 గంటల సమయానికి, ఎంసీఎక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.23 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,22,768 వద్ద ట్రేడ్ అవుతూ నెమ్మదించిన వేగాన్ని చూపింది. వెండి ఫ్యూచర్స్ 0.39 శాతం పెరిగి కిలోకు రూ. 1,55,717 చేరి ఇన్వెస్టర్లకు కొంత ఊరట ఇచ్చింది.
అమెరికా డాలర్ ఇండెక్స్ రెండు వారాల గరిష్ఠమైన 100.30 స్థాయిని తాకడం బంగారంపై ఒత్తిడిని పెంచిందని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా డాలర్ బలపడితే, ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేసేవారికి అది ఎక్కువగా ఖర్చవుతుంది. దీంతో అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ తగ్గే అవకాశం ఉండటం పసిడి ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఇక, బుధవారం వెల్లడైన అమెరికా ఫెడరల్ రిజర్వ్ అక్టోబర్ సమావేశ మినిట్స్ కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. వడ్డీ రేట్లను త్వరగా తగ్గించడం ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచవచ్చన్న ఆందోళనను కొందరు ఫెడ్ అధికారులు వ్యక్తం చేసినట్లు సమాచారం. దీతో డిసెంబర్‌లో వడ్డీ రేట్లలో కోత ఉండవచ్చన్న పెట్టుబడిదారుల అంచనాలు మరింత బలహీనపడ్డాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బంగారం సాధారణంగా ఆకర్షణీయత కోల్పోతుంది, ఎందుకంటే బంగారానికి వడ్డీ రూపంలో రాబడి ఉండదు.
మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, పసిడికి రూ. 1,22,200 వద్ద బలమైన మద్దతు కనిపించవచ్చు. అదే సమయంలో వెండికి రూ. 1,54,000 వద్ద సపోర్ట్ ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు, బంగారానికి రూ. 1,23,800 వద్ద, వెండికి రూ. 1,56,600 వద్ద నిరోధం ఉన్నట్లు సూచిస్తున్నారు. ఈ స్థాయిలను దాటి ధరలు కదిలేనా లేదా అనేది రాబోయే మార్కెట్ ధోరణులపై ఆధారపడి ఉంటుంది. ఫెడ్ అధికారుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, వడ్డీ రేట్ల తగ్గింపుపై జాగ్రత్తగా వ్యవహరించాలనే ధోరణి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ సంకేతాలు, కరెన్సీ మార్పులు మరియు పెట్టుబడిదారుల భావోద్వేగాలు కలగలిసిన నేపథ్యంలో, రాబోయే రోజుల్లో పసిడి–వెండి ధరల్లో మరింత ఒడిదుడుకులు కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
