Toll Free Travel: సంక్రాంతి పండుగ (Sankranti festival)వేళ సొంత గ్రామాలకు వెళ్లే లక్షలాది మంది ప్రయాణికులకు ఊరట కలిగించేలా తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక చర్యలకు సిద్ధమైంది. పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై టోల్ ఫీజుల భారాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkat Reddy)కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Minister Nitin Gadkari)కి లేఖ రాశారు. ప్రస్తుతం టోల్ గేట్ల వద్ద వసూళ్ల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి తన లేఖలో వివరించారు. వాహనాలు గంటల తరబడి ఆగిపోవడంతో ఇంధనం వృథా అవుతోందని, సమయ నష్టం కూడా భారీగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితి పండుగ ఆనందాన్ని తగ్గిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు, అలాగే తిరుగు ప్రయాణంలో జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ–హైదరాబాద్ మార్గంలో టోల్ ఫీజుల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి విజ్ఞప్తి చేశారు. పండుగ రోజుల్లో సాధారణ రోజులతో పోలిస్తే సుమారు 200 శాతం వరకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉందని, ఈ సమయంలో టోల్ గేట్లు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయని స్పష్టం చేశారు. ఈ అంశంపై సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో కలిసి హైవేపై పరిస్థితిని సమీక్షించారు.
జనవరి 8 నుంచే వాహనాల రద్దీ మొదలయ్యే అవకాశముందని అంచనా వేసిన మంత్రి, పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ నిరవధికంగా సాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయాలని సూచించారు. వైద్య, పోలీస్, రెవెన్యూ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అవసరమైతే పండుగ రోజుల్లో తాను స్వయంగా మోటార్ సైకిల్‌పై హైవేపైకి వచ్చి పరిస్థితిని పరిశీలిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఈ చర్యలతో సంక్రాంతి ప్రయాణాలు మరింత సురక్షితంగా, సాఫీగా సాగుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
