Hyderabad : హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్ భవన్(RTC Bus Bhavan) వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపు(RTC Fare increase)ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలు(BRS leaders) “ఛలో బస్ భవన్” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రముఖులు, మాజీ మంత్రులు కలిపి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao), తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. హరీశ్ రావు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి బస్ భవన్ కు చేరుకున్నారు. అదే సమయంలో రేతిఫైల్ బస్టాండ్ నుంచి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు కలిసి బస్సులో బస్ భవన్‌కు వచ్చారు. ప్రజల మధ్య ప్రయాణిస్తూ వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..“కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్ నడుపుతున్నదా, సర్కస్ నడుపుతున్నదా వాళ్లకే తెలియడం లేదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వడ్డించిన బస్సు ఛార్జీలను తక్షణమే తగ్గించాలి” అని డిమాండ్ చేశారు. ఉదయం మా ఇంటి దగ్గరకి 50 మంది పోలీసులు వచ్చారు. హౌస్ అరెస్ట్ అంటూ చెప్పారు. కానీ మా ప్రోగ్రామ్‌కు వెళ్ళమన్నారు. ఇదే వారి పాలన వైఫల్యానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ భవన్ వద్ద పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్, హరీశ్ రావులకు అనుమతి ఇవ్వగా పార్టీ కార్యకర్తలను బస్ భవన్ లోపలికి అనుమతించలేదు. దీంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.
ఆందోళన నేపథ్యంలో పోలీసులు పలు చోట్ల బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. కొంతమందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, మరికొంతమందిని వదిలేశారు. ఆర్టీసీ చార్జీల పెంపు ప్రజలకు భారం అవుతుందని, మధ్యతరగతి, పేదవర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వనున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించారు. ప్రజా రవాణా వ్యవస్థను నాశనం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల పోరాటం ఇంకా ముమ్మరంగా కొనసాగుతుందని హెచ్చరించారు. బస్సు ప్రయాణాన్ని నిత్యజీవితంలో భాగంగా చేసుకునే సాధారణ ప్రజలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రజలకు భారంగా మారిందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ప్రజలలోకి వెళ్లి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈ ఆందోళన రాజకీయ వేడి పెంచే అవకాశం ఉంది.