Mohan Bhagwat: మణిపూర్(Manipur) పర్యటనలో ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మోహన్ భగవత్, హిందూ సమాజం (Hindu society)మరియు భారత నాగరికత ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రపంచ నాగరికతల ప్రవాహంలో హిందూ సంప్రదాయం ఎందుకు ఇప్పటికీ నిలకడగా ఉందో వివరిస్తూ పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. భగవత్ మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలో అగ్రగామి స్థానాన్ని సంపాదించిన గ్రీస్, ఈజిప్ట్, రోమ్ వంటి మహా నాగరికతలు కాలక్రమంలో కనుమరుగైపోయినా, భారతీయ నాగరికత మాత్రం నిరంతరంగా కొనసాగుతూనే ఉందని గుర్తుచేశారు. అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, భారత నాగరికత అభివృద్ధి దిశగా సాగుతూనే ఉండటం దాని ప్రత్యేకత అని ఆయన అభిప్రాయపడ్డారు. మన ఆచారాలు, విలువలు, సంస్కారం ఇవన్నీ కలగలిసి భారత నాగరికతను శాశ్వతంగా నిలబెట్టాయి. అందుకే హిందూ సమాజం అమరమైనదని చెప్పవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక భారత్ అనే పేరే ఒక అజరామరమైన సంస్కృతి ప్రతీక అని పేర్కొంటూ ఈ నాగరికత ప్రపంచ ధర్మ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందన్నారు. హిందూ సమాజం విశ్వ సమతుల్యతను కాపాడే శక్తిగా నిలిచిందని ఆయన అభివర్ణించారు. మన సమాజంలో శతాబ్దాలుగా ఏర్పడిన బలమైన నిర్మాణాలు, సామాజిక విలువలు, పరస్పర అనుబంధాలు ఇవన్నీ కలసి ఈ దేశానికి అసాధారణ స్థిరత్వాన్ని ఇచ్చాయి. హిందువుల ఉనికే ప్రపంచ శాంతి, మనుగడకు ఆధారం అని నేను విశ్వసిస్తున్నాను, అని భగవత్ అన్నారు. మణిపూర్‌లో గత సంవత్సరం జాతి ఉద్రిక్తతలు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న తర్వాత భగవత్ ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణ, సామాజిక సమైక్యత అంశాలపై పరిశీలన చేసేందుకు ఆయన ఈ పర్యటన నిర్వహించినట్టు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. స్థానిక నాయకులతో చర్చలు జరిపిన ఆయన, సమాజంలో పరస్పర నమ్మకం, సహకారం అత్యంత అవసరమని చెప్పారు. భగవత్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారాయి. హిందూ నాగరికత శాశ్వతతపై ఆయన చేసిన విశ్లేషణ, మణిపూర్ తాజా పరిస్థితుల్లో ఆయన సందేశం ఇవి రెండూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
