Job Chart : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) గ్రామ, వార్డు సచివాలయ (Grama,Ward Sachivalayam)సిబ్బందికి సంబంధించి విధుల నిర్వహణలో ఏకరీతిని తీసుకురావడంపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో, సచివాలయ సిబ్బందిపై ఒకేసారి పలు శాఖల నుంచి తారతమ్యంలేని విధులు అప్పగించబడుతున్నాయని వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ప్రభుత్వం, కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా, ప్రతి ఉద్యోగికి ఏ విధులు ఉండాలో స్పష్టంగా పేర్కొన్న నిర్దిష్టమైన జాబ్ చార్ట్ (Job Chart) ను విడుదల చేసింది.
ప్రతి శాఖకు సంబంధించి సచివాలయ సిబ్బంది చేయవలసిన పనులను ఈ జాబ్ చార్ట్ లో వివరించగా, ఇకపై ఏ శాఖ అయినా ఈ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా కొత్త ఆదేశాలు జారీచేస్తే, అవి చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా, ఒకేసారి పలు పనులు అప్పగించాల్సిన పరిస్థితులు తలెత్తినప్పుడు, జిల్లా గ్రామ, వార్డు సచివాలయ అధికారి మరియు సంబంధిత శాఖల జిల్లా అధికారుల సూచనల మేరకు కలెక్టర్ అనుమతితో మాత్రమే ఆ పని ప్రాధాన్యతను నిర్ణయించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ విధంగా స్పష్టమైన విధుల నిర్మాణం వల్ల సిబ్బందిపై పనిచేసే ఒత్తిడి తగ్గి, సేవల నాణ్యత మెరుగవుతుందని భావిస్తోంది ప్రభుత్వం. నియమితంగా విధులను నిర్వహించకపోతే, జాబ్ చార్ట్ లో పేర్కొన్న విధివిధానాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తప్పవని కూడా ఆదేశాలు పేర్కొన్నాయి. జిల్లా కలెక్టర్లు లేదా నియామకాధికారులు ఈ జాబ్ చార్ట్ అమలుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంటూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పౌరసేవల సరళీకరణతో పాటు, ఉద్యోగుల భద్రతా దృష్ట్యా కూడా మంచి పరిణామాలు ఏర్పడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన సాధారణ జాబ్ ఛార్ట్
. గ్రామ, వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో పాల్గొనాలి.
. ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు, విస్తరణ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి.
. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి.
. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దకే చేరవేయాలి.
. సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షించాలి.
. విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి.
. ప్రభుత్వం అప్పగించే ఏ విధులైనా సమయానుసారం నిర్వర్తించాలి.
. నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి.
