TTP: అఫ్గానిస్థాన్(Afghanista)లో తాలిబన్లు(Taliban) తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణాసియా(South Asia)లో భద్రతా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా పాక్ సైన్యానికి పోటీగా వైమానిక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రకటన పాక్ అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో టీటీపీకి అనుబంధంగా ఉన్న ఖాతాల నుంచి వరుస పోస్టులు వెలువడ్డాయి.
2026 నాటికి వైమానిక దళాన్ని ఏర్పాటు చేస్తామని టీటీపీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ విభాగానికి సలీం హక్కానీ నాయకత్వం వహించనున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో సంస్థ నిర్మాణాన్ని ప్రావిన్స్‌ల వారీగా పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచన కూడా ఉందని సమాచారం. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక మిలిటరీ యూనిట్లను మోహరించడం, కమాండర్ల ఆధ్వర్యంలో కొత్త పర్యవేక్షణ జోన్‌లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. రెండు కొత్త పర్యవేక్షణ జోన్‌లు ఏర్పాటు చేసి, వాటికి అనుభవజ్ఞులైన మిలిటరీ కమాండర్లను నియమించాలన్న యోచనలో ఉందని తెలుస్తోంది. అలాగే కశ్మీర్, గిల్గిత్-బాల్టిస్థాన్‌తో పాటు మరికొన్ని సున్నిత ప్రాంతాలపై ప్రభావం పెంచుకోవాలని టీటీపీ భావిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ లక్ష్యాలను సాధించేందుకు మిలిటరీ యూనిట్లలో నాయకత్వ మార్పులు చేపట్టి, స్థానిక కమాండర్లకు మరింత అధికారాలు ఇవ్వనున్నట్లు సమాచారం. దీనివల్ల కార్యకలాపాల వేగం పెరుగుతుందని టీటీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, 2022 నవంబరులో పాక్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని టీటీపీ రద్దు చేసింది. అప్పటి నుంచి పాకిస్థాన్ భద్రతా దళాలు, పోలీసులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలోచిస్థాన్ ప్రావిన్స్‌లలో ఈ దాడుల తీవ్రత ఎక్కువగా ఉందని పాక్ అధికారులు చెబుతున్నారు. టీటీపీ అఫ్గానిస్థాన్ భూభాగాన్ని ఆశ్రయంగా చేసుకుని దాడులకు పాల్పడుతోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమ భూభాగాన్ని ఇతర దేశాలపై దాడులకు ఉపయోగించనివ్వమని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాంతీయ భద్రతపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి.
