ప్రముఖ తెలుగు టీవీ చానెల్లో యాంకర్, కవయిత్రి (News Anchor, poet Swecha) స్వేచ్ఛ వోటార్కర్ (37) హైదరాబాద్‌లోని తన నివాసంలో బలవన్మరణానికి (Suicide) పాల్పడ్డారు. చిక్కడపల్లి సీఐ రాజునాయక్ వివరాలు వెల్లడించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్‌లో ఓ అపార్ట్మెంట్లో స్వేచ్ఛ తన తల్లి, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నారు.
శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన శ్రీదేవి కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటి తలుపు కొట్టగా స్వేచ్ఛ ఎంతకీ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన శ్రీదేవి స్థానికుల సాయంతో తలుపు తెరిపించింది. లోపలికి వెళ్లి చూడగా స్వేచ్ఛ లుంగీతో ఉరేసుకుని విగతజీవిగా కనిపించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కవయిత్రిగా గుర్తింపు..
చిన్నప్పటి నుంచి అభ్యుదయ భావాలు (Progressive Thinker)గల స్వేచ్ఛకు టీవీ రంగంలో రాణించాలనే కోరిక ఉండేది. ఈ మేరకు ఆమె వృత్తిగా అదే రంగాన్ని ఎంచుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యాక్టివిస్ట్ (Social Activist)గా ఉన్నారు. అనేక ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. ఆమెకు సాహిత్యంపైనా మక్కువ ఎక్కువ. ఆ అభిరుచితోనే ఆమె అనేక కవితలు రాశారు.
ఆమె రాసిన కవితలు అనేక వెబ్సెట్లలో వచ్చాయి. ‘యుద్ధం’ అనే టాపిక్‌పై ఆమె రాసిన కవితలు ఇప్పటికీ సోషల్‌మీడియాలో కనిపిస్తాయి. స్వేచ్ఛ అనేక టీవీ చానళ్లలో యాంకర్‌గా, న్యూస్ ప్రజెంటర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో ఆమె ఓ వ్యక్తిని వివాహమాడారు. వీరికి ఒక పాప. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. ప్రస్తుతం స్వేచ్ఛ తన కుమార్తె, తల్లి శ్రీదేవితో కలిసి జవహర్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు.
ఆమె తండ్రి శంకర్ ఒకప్పుడు వామపక్ష ఉద్యమాల్లో పనిచేశారు. తల్లి శ్రీదేవి కూడా చైతన్య మహిళా సంఘంలో యాక్టివిస్ట్‌గా కొనసాగుతున్నారు. స్వేచ్ఛ బలవన్మరణంపై సాహితీవేత్తలు, కవులు, కళాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.