PM Modi : భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ (Vande Mataram) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏడాది పాటు జరగనున్న ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నాడు నూతన ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం (Indira Gandhi Indoor Stadium)లో ఘనంగా శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన వందేమాతరం స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఈ గీతం ప్రతిధ్వనించేలా ఒక సంవత్సరం పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతోత్సవాలు, పాఠశాలల స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..నవంబర్ 7 భారత చరిత్రలో ఒక గౌరవప్రదమైన రోజు. 150 సంవత్సరాల క్రితం బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఇది కేవలం ఒక పదం కాదు, అది ఒక మంత్రం, ఒక శక్తి, ఒక సంకల్పం. ఇది మనల్ని మన చరిత్రతో, సంస్కృతితో, స్వాతంత్ర్య స్ఫూర్తితో అనుసంధానిస్తుంది అన్నారు.
మోదీ మాట్లాడుతూ, వందేమాతరం భారతీయుల మనసులోని దేశభక్తి జ్వాలలను రగిలించిందని, అదే స్ఫూర్తితో నూతన భారత్ దిశగా కదలాలని పిలుపునిచ్చారు. మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన వీరసమరయోధులకు ఆయన నివాళులర్పించి, వారి త్యాగాల వల్లే మనం స్వతంత్ర భారతంలో జీవిస్తున్నామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా హాజరయ్యారు. షెకావత్ మాట్లాడుతూ, “వందేమాతరం అనేది స్వాతంత్ర్య సమరయోధుల చివరి శ్వాసలో వినిపించిన నినాదం. అది భారతీయుల ఏకతకు ప్రతీక. వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ఈ గీతం మళ్లీ దేశాన్ని ఒక తాటిపైకి తెస్తుంది అన్నారు.
ఉత్సవాల భాగంగా ప్రభుత్వం ఒక డిజిటల్ పోర్టల్ను ప్రారంభించింది. పౌరులు తమ స్వరంతో వందేమాతరం పాడి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయవచ్చు. శుక్రవారం ఉదయం 9:50 గంటలకు దేశవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఒకే సమయానికి వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తి గీతానికి ఘనమైన శ్రద్ధాంజలి ఘటించారు. 1875 నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినాన బంకిమ్ చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారు. ఆయన నవల ‘ఆనందమఠం’లో భాగంగా ఇది మొదటిసారిగా ‘బంగదర్శన్’ పత్రికలో ప్రచురితమైంది. మాతృభూమిని శక్తి, సౌభాగ్యాల ప్రతీకగా చిత్రీకరించిన ఈ గీతం స్వదేశీ ఉద్యమానికి ప్రధాన నినాదంగా మారి జాతీయ చైతన్యాన్ని రగిలించింది. భాషా, ప్రాంతీయ, మత భేదాలను అధిగమించి భారతీయ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన వందేమాతరం జాతీయ గీతం 150 ఏళ్ల మహోత్సవాలు 2026 నవంబర్ 7 వరకు కొనసాగనున్నాయి.
