Aadarsha Kutumbam : త్రివిక్రమ్(Trivikram)దర్శకత్వంలో వెంకటేశ్ (Venkatesh)ప్రధాన పాత్రలో ఓ భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఎంతో ఆసక్తి రేకెత్తించిన ఈ ప్రాజెక్ట్‌కు ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam)అనే పేరును ఖరారు చేసి, ఉపశీర్షికగా ‘హౌస్ నం. 47 (AK47)’ ను జత చేశారు. చిత్ర ప్రకటననుంచే అనేక టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వాటన్నింటికీ ముగింపు పలుకుతూ నిర్మాతలు ఈ రోజు అసలు టైటిల్‌ను వెలుగులోకి తీసుకువచ్చారు.
అలాగే సినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచే మొదలైనట్లు తెలియజేస్తూ, వెంకటేశ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. సాదాసీదా డ్రెస్‌లో మధ్యతరగతి వ్యక్తి లుక్‌లో కనిపించిన వెంకటేశ్, అభిమానులను బాగా ఆకట్టుకున్నారు. వచ్చే ఏడాది వేసవికల్లా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం సిద్ధమవుతోంది. ఇటీవల సంచలన విజయాన్ని అందుకున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేశ్ సోలోహీరోగా నటిస్తున్న చిత్రం ఇదే కావడంతో, అభిమానుల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది.
ఇదివరకు వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలకు త్రివిక్రమ్ కథ అందించగా, ఆ రెండు చిత్రాలు మంచి వినోదాన్ని పంచాయి. అందుకే ఈ కాంబినేషన్‌లో మళ్లీ వస్తున్న కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు, త్రివిక్రమ్ తాజా చిత్రాల్లోలాగే ఈ సినిమాలో కూడా ఇద్దరు నాయికలకు అవకాశం ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. హీరోయిన్ల జాబితాలో త్రిష, నిధి అగర్వాల్, రుక్మిణీ వసంత్ పేర్లు చర్చకు వస్తున్నాయి. అయితే త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇక, వెంకటేశ్ మాత్రం వరుసగా కొత్త ప్రాజెక్ట్స్‌తో బిజీగా మారుతున్నారు. చిరంజీవి–అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్’ లో అతిథి పాత్రలో కనిపించనుండగా, ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీలోని మూడో భాగం ‘దృశ్యం–3’ కోసం కూడా సిద్ధమవుతున్నారు. కుటుంబ కథా చిత్రాలతో పాటు థ్రిల్లింగ్ కథల్లోనూ తనదైన నైపుణ్యంతో ఆకట్టుకునే వెంకటేశ్, రాబోయే నెలల్లో వరుసగా సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.
