Parliament : ‘వందేమాతరం’(Vande Mataram) గేయం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని పార్లమెంట్ ప్రత్యేక చర్చకు వేదికైంది. సోమవారం లోక్‌సభలో(Lok Sabha) జరిగిన ఈ చర్చను ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రారంభించారు. ఈ చర్చ కోసం దిగువ సభ మొత్తం 10 గంటల ప్రత్యేక సమయాన్ని కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఉప నేత గౌరవ్ గొగొయ్, ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా సహా పలువురు ప్రతిపక్ష నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయనున్నారు.
చర్చను ప్రారంభిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ..“వందేమాతరం 150 ఏళ్ల చారిత్రక ఘట్టానికి మనం ప్రత్యక్ష సాక్షులమవుతున్నాం. ఇది కేవలం గేయ చర్చ మాత్రమే కాదు, ఈ సభ దేశం పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనం. మనం దీన్ని సద్వినియోగం చేసుకొని భావితరాలకు విలువైన సందేశాన్ని అందించగలగాలి,” అని అన్నారు.
దేశం ప్రస్తుతం సర్దార్ వల్లభభాయ్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నదని పేర్కొన్నారు. మోదీ తన ప్రసంగంలో వందేమాతరం రచన వెనుక ఉన్న నేపథ్యాన్ని వివరించారు. బంకించంద్ర ఛటర్జీ ఈ గేయాన్ని 1875లో రచించిన వేళ భారత్ బానిసత్వపు సంకెళ్లలో ఉంది. 100 ఏళ్ల తర్వాత ఆత్మన్యూనత నింపిన వలస పాలన భారతీయుల గొంతును నొక్కే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ, ఇదే వందేమాతరం మనలో జాతీయతా భావాన్ని రగిలించి స్వాతంత్ర్యంకు దారితీసింది. 1947లో స్వాతంత్ర్య పోరాటానికి ఇది ఒక శక్తిస్వరూపంగా నిలిచింది అని తెలిపారు. మోదీ మరింతగా వందేమాతరం సారాన్ని వివరిస్తూ, “వందేమాతరం కేవలం రాజకీయ గీతం కాదు. వేదకాలం నుంచి ఈ భూమిని తల్లిగా భావించే భారతీయ భావజాలానికి ఇది ప్రతీక. వేల ఏళ్ల సంస్కృతిని, స్వాతంత్ర్య స్పూర్తిని ప్రతిబింబించే ఈ గేయం బ్రిటిష్ పాలనలో ఉన్న భారతీయులలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
మన పోరాటం భూమి లేదా అధికారంకోసం కాదు, బానిసత్వాన్ని చెరిపేసి భారతీయతను పునరుద్ధరించాలన్న సంకల్పానికి ఇది ప్రతిరూపం అని అన్నారు. బంకించంద్ర ఛటర్జీ మొదటగా ఈ గేయాన్ని స్వతంత్ర రచనగా ప్రకటించగా, అనంతరం తన ప్రసిద్ధ నవల ‘ఆనంద్‌మఠ్’లో దీన్ని భాగం చేశారు. దేశప్రేమ, త్యాగం, స్వేచ్ఛ కోసం పోరాటం వంటి భావాలను భారతీయుల హృదయాల్లో నాటిన ఈ గేయం నేటికి కూడా సమాన శక్తిని కలిగిస్తోంది. ఈ చర్చలో అధికార–ప్రతిపక్ష భేదాలు లేవని, ఇది భారతీయులందరికీ చెందిన ఆత్మగౌరవ గీతమని మోదీ స్పష్టం చేశారు. వందేమాతరం మన స్వాతంత్ర్యం, మన సంస్కృతి, మన స్వభిమానానికి ప్రతీక. ఇది భవిష్యత్తు తరాలకు కూడా ప్రేరణగా నిలుస్తుంది అని వ్యాఖ్యానించారు.
